న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. వచ్చే ఐదేండ్లకాలంలో భారత్లో 35 బిలియన్ డాలర్లు లేదా రూ.3.14 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. ఏఐ ఆధారిత డిజిటలైజేషన్, ఎగుమతుల్లో వృద్ధి, ఉద్యోగాలను సృష్టించడానికి భారీ స్థాయిలో నిధులను ఖర్చు చేయబోతున్నట్టు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ తెలిపారు.
అలాగే భారత్ నుంచి ఎగుమతులు 80 బిలియన్ డాలర్లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. 20 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి మరోవైపు, 2030 వరకు పది లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా, సీజనల్ ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ఆయన ప్రకటించారు.
2010 నుంచి ఇప్పటి వరకు భారత్లో సంస్థ 40 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో వచ్చే ఐదేండ్లలో మరో 35 బిలియన్ డాలర్ల మేర నిధులను ఖర్చు చేయబోతున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్ 17.5 బిలియన్ డాలర్లు, గూగుల్ 15 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు.