Amazon : ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించిన అమెజాన్.. ఇప్పుడు మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోందని సమాచారం. నేటి నుంచే ఉద్యోగుల్ని తొలగించబోతుంది. ఈసారి దాదాపు 16,000 మందిని తీసేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
నేటి నుంచి వారం రోజుల్లోపు ఇందుకు సంబంధించి ఆదేశాలొచ్చే అవకాశం ఉంది. గత ఏడాది చివర్లో అమెజాన్ సంస్థ దాదాపు 14,000 మంది స్టాఫ్‌ను తొలగించింది. ఇప్పుడు మరో 16,000 మందిని తొలగించనుంది. అంటే ఆరు నెలల వ్యవధిలోనే దాదాపు 30,000 మందిని తొలగించినట్లవుతుంది. అంతకుముందు 2023లో 27,000 మందికి ఉద్వాసన పలికింది. ఏఐ, ఆటోమేషన్ కారణంగానే ఉద్యోగుల కోత జరుగుతోందని విశ్లేషకుల అంచనా.
ఉద్యోగుల తొలగింపుపై మేనేజర్లు, సీనియర్ లీడర్లకు ఈ మేరకు ఇప్పటికే సమాచారం అందింది. పనితీరు ఆధారంగా కూడా లేఆఫ్స్ జరుగుతున్నాయని అమెజాన్ ఉద్యోగులకు తెలిపింది. అమెజాన్‌లో రిటైల్, వేర్‌హౌజ్ సిబ్బందితోపాటు హై శాలరీ కార్పొరేట్, అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగుల్ని కూడా కంపెనీ తొలగిస్తోంది.