శుక్రవారం 22 జనవరి 2021
Business - Nov 25, 2020 , 12:01:21

అంబానీ వ‌ర్సెస్ బెజోస్‌.. ఫ్యూచ‌ర్‌ కోసం కుబేరుల కొట్లాట‌

అంబానీ వ‌ర్సెస్ బెజోస్‌.. ఫ్యూచ‌ర్‌ కోసం కుబేరుల కొట్లాట‌

ముంబై: ప‌్ర‌స్తుతం ఇద్దరు కుబేరుల మ‌ధ్య ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఫైట్ న‌డుస్తోంది. ఇండియ‌న్ రిటెయిల‌ర్ మార్కెట్‌పై ప‌ట్టు కోసం అమెజాన్‌, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ నువ్వా నేనా అంటున్నాయి. అమెజాన్ అమెరికా బిగ్ బ్ర‌ద‌ర్ అని, 21వ శతాబ్ద‌పు ఈస్ట్ కంపెనీ అని రిల‌య‌న్స్ చేస్తున్న ఆరోప‌ణ‌లు ఈ ఫైట్‌ను స్వ‌దేశీ వ‌ర్సెస్ విదేశీగా మార్చేసింది. ల‌క్ష కోట్ల డాల‌ర్ల ఇండియ‌న్ క‌న్జూమ‌ర్ మార్కెట్‌పై ఆధిప‌త్యాన్ని క‌ట్ట‌బెట్టే ఈ ఫైట్‌లో ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఫ్యూచ‌ర్ గ్రూప్ ఆస్తుల‌ను కొనుగోలు చేయ‌డానికి రిల‌య‌న్స్ చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని అమెజాన్ స‌వాలు చేయ‌డంతో ఈ ఇద్దరు కుబేరుల మ‌ధ్య పోరు మొద‌లైంది. ఇందులో ఒక‌రు ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కాగా.. మ‌రొక‌రు ఆసియాలోనే రిచెస్ట్ మ్యాన్, రిల‌య‌న్స్ అధినేత ముకేష్ అంబానీ. 

ఫ్యూచ‌ర్ గ్రూప్‌కు త‌మ‌తో ఒప్పందం ఉన్న‌ద‌ని, ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి త‌మ ఆస్తుల‌ను ప్ర‌త్య‌ర్థి కంపెనీ అయిన రిల‌యెన్స్‌కు ఎలా అమ్ముతుంద‌న్న‌ది అమెజాన్ వాద‌న‌. ఇదే వాద‌న‌తో సింగ‌పూర్ కోర్టు నుంచి డీల్‌పై స్టే తీసుకొచ్చింది. అయితే సింగపూర్ కోర్టు ఆదేశాలు భార‌త చ‌ట్టాల‌కు వ‌ర్తించ‌ద‌ని, ఈ డీల్‌కు అనుమ‌తించాలంటూ రిల‌య‌న్స్ ఢిల్లీ కోర్టును ఆశ్ర‌యించింది. ముకేష్ సంస్థ త‌ర‌ఫున ప్ర‌ముఖ లాయ‌ర్ హ‌రీష్ సాల్వే వాదిస్తుండ‌గా.. అమెజాన్ త‌ర‌ఫున మాజీ అటార్నీ జ‌న‌ర‌ల్ గోపాల్ సుబ్ర‌మ‌ణ్యం వాద‌న‌లు వినిపిస్తున్నారు. అయితే ఈ కేసులో గెల‌వ‌డానికి రిల‌యన్స్ స్వ‌దేశీ, విదేశీ నినాదాన్ని తెర‌పైకి తెచ్చింది. కోర్టులో వాద‌న‌ల సంద‌ర్భంగా అమెజాన్‌ను అమెరికా బిగ్ బ్ర‌ద‌ర్ అని, 21వ శతాబ్ద‌పు ఈస్ట్ ఇండియా కంపెనీ అని హ‌రీష్ సాల్వే అన‌డం విశేషం.

బిజినెస్ చేస్తే త‌మ‌తో చేయాల‌ని, లేదంటే కంపెనీ మూసేయాల‌న్న‌ట్లుగా అమెజాన్ వాద‌న ఉన్న‌ద‌ని రిల‌య‌న్స్ వాదిస్తోంది. ఫ్యూచ‌ర్ గ్రూప్ కొనుగోలు చేస్తే ఇప్ప‌టికే ఇండియాలో అతిపెద్ద రిటెయిలర్‌గా ఉన్న రిల‌య‌న్స్‌కు ఇక తిరుగుండ‌దు. ఇప్ప‌టికీ మ‌న దేశంలో చాలా మంది స్టోర్ల‌కు నేరుగా వెళ్లి కొనుగోలు చేయ‌డానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొనే అంబానీ.. ఫ్యూచ‌ర్ గ్రూప్‌పై క‌న్నేశారు. అదే జ‌రిగితే ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్‌కు పెద్ద దెబ్బ ప‌డిన‌ట్లే. అందుకే ఫ్యూచ‌ర్ గ్రూప్ .. రిల‌య‌న్స్ చేతికి వెళ్ల‌కుండా అమెజాన్ అడ్డుప‌డుతోంది. 

అమెజాన్ త‌ర‌ఫు న్యాయ‌వాది గోపాల్ సుబ్ర‌మ‌ణ్యం వాదిస్తూ.. అమెజాన్ ఇప్ప‌టికే దేశంలో 6500 కోట్ల డాల‌ర్ల (సుమారు రూ.4.8 ల‌క్ష‌ల కోట్లు) పెట్టుబ‌డులు పెట్టింద‌ని, వేల‌కొద్దీ ఉద్యోగాల‌ను సృష్టించింద‌ని అన్నారు. ఆ సంస్థ బిగ్ బ్ర‌ద‌రో, ఈస్ట్ ఇండియా కంపెనీయో కాద‌ని వాదించారు. అప్పుల్లో ఉన్న ఫ్యూచ‌ర్ కంపెనీని గ‌ట్టెక్కించింది అమెజానే అని చెప్పారు. గ‌త ఆగ‌స్ట్‌లోనే 3400 కోట్ల డాల‌ర్ల‌తో ఫ్యూచ‌ర్ గ్రూప్‌ను కొనుగోలు చేయ‌డానికి రిల‌య‌న్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే అప్ప‌టికే ఇందులో అమెజాన్‌కు 49 శాతం వాటా ఉంది. దీంతో ప్ర‌త్యర్థి కంపెనీకి ఎలా అమ్ముతారంటూ అమెజాన్ కోర్టు గ‌డప తొక్కింది. అయితే ఇప్ప‌టికే ఈ పోరులో అమెజాన్‌కు తొలి దెబ్బ ప‌డింది. నియంత్ర‌ణ సంస్థ కాంపిటిష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా రిల‌య‌న్స్‌-ఫ్యూచ‌ర్ గ్రూప్ డీల్‌ను ఆమోదించింది. మ‌రి ఈ కుబేరుల ఫైట్‌లో తుది గెలుపు ఎవ‌రిది అవుతుందో చూడాలి. 


logo