హైదరాబాద్, ఆగస్టు 14: అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.164.8 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.249.12 కోట్ల లాభంతో పోలిస్తే 33 శాతం తగ్గినట్టు పేర్కొంది. నిర్వహణ ఖర్చులు అధికమవడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.3,263.05 కోట్ల నుంచి రూ.3,401.08 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. నిర్వహణ ఖర్చులు రూ.3,190.66 కోట్లకు చేరుకోవడం వల్లనే లాభాలపై ప్రతికూల ప్రభావం చూపిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.