న్యూఢిల్లీ, మార్చి 17: బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ హై రికార్డులతో హోరెత్తించాయి. సోమవారం దేశీయ మార్కెట్లో అటు గోల్డ్, ఇటు సిల్వర్ రెండింటి రేట్లూ పరుగులు పెట్టాయి. ఏకంగా రూ.1,300 చొప్పున ఎగబాకి మునుపెన్నడూలేని స్థాయిల్లో స్థిరపడ్డాయి. అఖిల భారత సరఫా అసోసియేషన్ వివరాల ప్రకారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ రూ.1,300 పుంజుకొని మొదటిసారి రూ.90వేల మార్కును దాటుతూ రూ.90,750గా నమోదైంది. దీంతో మునుపటి రూ.89,450 రికార్డు చెరిగిపోయినైట్టెంది. మరోవైపు వెండి ధరలూ దౌడు తీశాయి. కిలో ధర ఈ ఒక్కరోజే రూ.1,300 ఎగిసి రూ.1,02,500గా నమోదైంది. ఈ స్థాయికి వెండి ధర రావడం ఇదే తొలిసారి.
హైదరాబాద్‌లో..
దేశ రాజధానిలో బంగారం మెరిసినా.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆ వెలుగులు కనిపించలేదు. తులం పసిడి రూ.90వేల దిగువనే ఉన్నది. 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ.89,560గా రికాైర్డెంది. అలాగే 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత లేదా ఆభరణాల బంగారం) పుత్తడి విలువ 10 గ్రాములు రూ.82,100గా నమోదైంది. మునుపటితో చూస్తే రూ.100 మేర ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఇదీ సంగతి..
గోల్డ్, సిల్వర్ రేట్లు ఇంతలా జూమ్ కావడానికి దేశ, విదేశీ పరిస్థితులే కారణంగా నిలుస్తున్నాయి. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేస్తున్న సుంకాలు.. అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. దీంతో గ్లోబల్ ఇన్వెస్టర్లను ట్రేడ్ వార్ భయాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే తమ పెట్టుబడుల రక్షణార్థం.. సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం, వెండి వైపునకు మదుపరులు అడుగులేస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుండటంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అలాగే భారత్‌సహా ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు పసిడి నిల్వలను పెంచుకుంటుండటం కూడా గోల్డ్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నదని నిపుణులు తాజా సరళిని విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, ఎర్ర సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం తగ్గడంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను మరింత తగ్గిస్తుందన్న అంచనాలు కూడా ధరలను ఎగదోస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు