న్యూఢిల్లీ, డిసెంబర్ 24 : దేశీయ విమానయాన రంగంలోకి మరిన్ని కొత్త సంస్థలు అడుగుపెట్టబోతున్నాయి. అల్హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ విమాన సర్వీస్‌లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల (ఎన్వోసీ)ను ఆయా కంపెనీలు పొందాయి. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శంఖ్ ఎయిర్‌కు ఎన్వోసీ ఉన్నది. దీంతో వచ్చే ఏడాది నుంచి ఈ మూడు ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయని చెప్తున్నారు. ముందుగా 2026 జనవరి-మార్చి త్రైమాసికంలో శంఖ్ ఎయిర్‌లైన్స్ సర్వీసులు మొదలయ్యే అవకాశాలున్నాయి. ఇటీవలే శంఖ్ ఏవియేషన్ సీఎండీ శర్వణ్ కుమార్ విశ్వకర్మ.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడును కలిసి విమాన సర్వీసుల విస్తరణపై మాట్లాడారు. సాంకేతిపరమైన లోటుపాట్లను పరిశీలిస్తున్నామని, వచ్చే 2-3 ఏండ్లలో 20-25 విమాన సర్వీసులను అందుబాటులో ఉంచుతామని బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆ కంపెనీ తెలియజేసింది. కాగా, అల్హింద్ ఎయిర్.. కేరళకు చెందిన అల్హింద్ గ్రూప్‌ది. ఇక ఫ్లైఎక్స్‌ప్రెస్.. హైదరాబాద్‌కు చెందిన సంస్థది. ఈ కంపెనీ ఇప్పటికే కొరియర్, కార్గో కార్యకలాపాలను నిర్వహిస్తున్నది.
ఇటీవలి ఇండిగో వ్యవహారం.. యావత్తు భారతీయ విమానయాన రంగాన్నే కుదిపేసింది. గుత్తాధిపత్యం వల్ల ఏర్పడే ఇబ్బందులను కండ్లకు కట్టినట్టు చూపించింది. ఈ పరిస్థితి కేంద్ర ప్రభుత్వాన్నీ విమర్శలపాలు చేసింది. ఇక ప్రస్తుతం తొమ్మిది ఎయిర్‌లైన్స్.. దేశీయ విమానయాన సర్వీసులను అందిస్తున్నాయి. వీటిలో ఇండిగో, ఎయిర్ ఇండియా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ల వాటానే 90 శాతానికిపైగా ఉండటం గమనార్హం. ఒక్క ఇండిగో వాటానే 65 శాతాన్ని మించి ఉంటుంది. అందుకే ఇండిగో సంక్షోభం ప్రభావం అంత పెద్ద ఎత్తున కనిపించింది. నిజానికి ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్లలో భారత్ కూడా ఒకటి.

ఈ క్రమంలోనే దేశీయంగా మరిన్ని ఎయిర్‌లైన్స్‌ను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదిప్పుడు. గతంతో పోల్చితే నాలుగైదు సంస్థలు మూతబడ్డాయి మరి. అక్టోబర్‌లో ప్రాంతీయ ఎయిర్‌లైన్ ఫ్లై బిగ్ విమాన సర్వీసులు ఆగిపోగా.. అంతకుముందు ఆర్థిక ఇబ్బందులతో జెట్ ఎయిర్వేస్, గో ఫస్ట్ (గోఎయిర్) నిలిచిపోయాయి. ఆ మునుపు కింగ్‌ఫిషర్ సంగతి తెలిసిందే. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వివరాల ప్రకారం ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కాకుండా.. ప్రభుత్వ రంగ సంస్థ అలయెన్స్ ఎయిర్, ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్, స్టార్ ఎయిర్, ఫ్లై91, ఇండియావన్ ఎయిర్ ఉన్నాయి. ఇందులో ఉడాన్ పథకం కింద స్టార్ ఎయిర్, ఇండియావన్ ఎయిర్, ఫ్లై91 వంటి చిన్న క్యారియర్లు దేశీయ మార్గాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
వచ్చే ఏడాది నుంచి రోమ్ (ఇటలీ)కు విమాన సర్వీసులను టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియా సంస్థ పునరుద్ధరించబోతున్నది. అలాగే ఢిల్లీ నుంచి లండన్ (బ్రిటన్)కు ఫ్లైట్లను తిరిగి ప్రారంభించాలని ఇండిగో కూడా చూస్తున్నది. 2020 ఆరంభంలో ఢిల్లీ నుంచి ఇటలీ రాజధాని నగరం రోమ్కు ఎయిర్ ఇండియా విమానాలు నడిచాయి. అయితే కరోనా కారణంగా ఆగిపోయాయి. ఇక ఇండిగో ముంబై-లండన్ మధ్య ప్రస్తుతం రోజువారీ, డైరెక్ట్ సర్వీసులను నడుపుతూనే ఉన్నది. కాగా, వచ్చే ఏడాది మార్చి 25 నుంచి ఢిల్లీ-రోమ్ మధ్య వారానికి 4 సర్వీసులను ఎయిర్ ఇండియా నడుపనున్నది. సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో బోయింగ్ 787-8 ఎయిర్‌క్రాఫ్ట్‌లు నడుస్తాయని సంస్థ తెలియజేసింది.