Sugar Exports | భారత్ చక్కెర ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం 2024-25 జూన్ 6 వరకు భారత్ 5.16 లక్షల టన్నుల షుగర్‌ను ఎగుమతి చేసింది. ట్రేడ్ బాడీ ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ (AISTA) మంగళవారం డేటా ప్రకారం.. చక్కెర మార్కెటింగ్ సంవత్సరం అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు నడుస్తుంది. భారతదేశంలో 2024-25 మార్కెటింగ్ సంవత్సరానికి చక్కెర ఎగుమతులను జనవరి 20న కేంద్రం అనుమతి చ్చింది. గరిష్ట ఎగుమతి పరిమాణాన్ని 10 లక్షల టన్నులుగా నిర్ణయించింది. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం జూన్ 6 వరకు మిల్లులు మొత్తం 5,16,782 టన్నుల చక్కెరను ఎగుమతి చేశాయి.
ఇందులో 4.09 లక్షల టన్నుల తెల్ల చక్కెర, 81,845 టన్నుల శుద్ధి చేసిన చక్కెర, 25,382 టన్నుల ముడి చక్కెర ఎగుమతి అయ్యింది. దాదాపు 23,219 టన్నుల చక్కెర లోడింగ్ దశలో ఉన్నది. ఇప్పటివరకు జరిగిన మొత్తం ఎగుమతుల్లో అత్యధికంగా సోమాలియాకు గరిష్టంగా 1,18,553 టన్నుల చక్కెర ఎగుమతి అయ్యింది. ఆ తర్వాత శ్రీలంకకు 76,401 టన్నులు, ఆఫ్ఘనిస్తాన్ కు 72,833 టన్నులు, జిబౌటికి 69,609 టన్నులు ఎగుమతులు జరిగాయని ట్రేడ్ అసోసియేషన్ పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసే సీజన్లో 10 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి కేంద్రం జనవరిలో అనుమతి ఇవ్వగా.. మొత్తం ఎగుమతులు 8లక్షల టన్నులకు చేరుకోవచ్చని ట్రేడ్ బాడీ ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ ఇటీవల తెలిపింది.