Starlink | స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ను భారత్‌కు తీసుకువచ్చేందుకు ఎయిర్టెల్ ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్తో ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ పేర్కొంది. దాంతో తమ యూజర్లకు స్టార్‌లింక్ హైస్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించనున్నట్లు చెప్పింది. అయితే, స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేసన్ సేవలకు కేంద్రం అనుమతి ఇస్తేనే ఈ ఒప్పందం అమలు ఆధారపడి ఉంటుందని ఎయిర్టెల్ వెల్లడించింది. భారత్‌లోని యూజర్లకు స్టార్‌లింక్ సేవలను అందించేందుకు స్పేస్ఎక్స్తో కలిసి పని చేయడం ఓ కీలకమైన మైలురాయని, తర్వాతి తరం శాటిలైట్ కనెక్టివిటీని యూజర్లకు అందించాలనే తమ నిబద్ధతకు ఇది తార్కాణమని ఎయిర్టెల్ ఎండీ, వైస్ చైర్మన్ గోపాల్ విట్టల్ పేర్కొన్నారు.
స్పేస్ఎక్స్తో ఒప్పందం నేపథ్యంలో భారత్‌లోని మారమూల ప్రాంతాలకు సైతం హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించే సామర్థ్యం ఎయిర్‌టెల్‌కు కలుగుతుంది. దాంతో ప్రతి వ్యక్తికి, వ్యాపారాలకు, కమ్యూనిటీలకు వేగవంతమైన ఇంటర్నెట్ లభిస్తుంది. ఒప్పందం మేరకు ఎయిర్టెల్ రిటైల్ స్టోర్స్‌లో స్టార్‌లింక్ పరికరాలు అందుబాటులోకి ఉంటాయి. ఎయిర్టెల్ స్టోర్స్‌లో స్టార్‌లింక్ పరికరాలను విక్రయిస్తారు. వాటితో ఎయిర్టెల్ వినియోగదారులకు నేరుగా స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందుతాయని విట్టల్ పేర్కొన్నారు. ఎయిర్టెల్ ఇప్పటికే శాటిలైట్ ఇంటర్నెట్ను అందిస్తోంది. యూటెల్సాట్ వన్‌వెబ్‌తో భాగస్వామ్యంతో ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నది. తాజాగా స్టార్‌లింక్‌తో ఒప్పందం నేపథ్యంలో మారమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ కవరేజ్ విస్తరించనున్నది.