న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దేశీయంగా విమానాలు ఎక్కేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 7 శాతం నుంచి 10 శాతం వృద్ధితో 16.4 కోట్ల నుంచి 17 కోట్లకు చేరుకునే అవకాశం ఉన్నదని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది. అలాగే విమానయాన సంస్థల నష్టాలు కూడా రూ.2-3 వేల కోట్ల స్థాయిలో ఉంటాయని వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో విమాన ప్రయాణికులు 5.3 శాతం ఎగబాకి 7.93 కోట్లకు చేరుకున్నారు. అలాగే అంతర్జాతీయ ప్రయాణికులు 16.2 శాతం చొప్పున అధికమయ్యారు.
దేశీయ విమానయాన రంగంపై ఇక్రా ఆశాజనక వృద్ధిరేటును ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో వచ్చే ఏడాది ఈ రంగం నిలకడైన వృద్ధిని నమోదు చేసుకోనున్నదని పేర్కొంది. ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కింజల్ షా మాట్లాడుతూ..ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో విమానయాన రంగం రూ.2 వేల కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల స్థాయిలో నష్టాలను నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. అధిక ఇంధన ధరలతో ఇబ్బందులు పడిన విమానయాన సంస్థలు గడిచిన రెండేండ్లగా ధరలు తగ్గడంతో లాభాలు మెరుగుపరుచుకుంటున్నాయని, మరోవైపు నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి అధికప్రాధాన్యతనిస్తున్నాయన్నారు.
ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లో కిలో లీటర్ విమాన ఇంధన ధరలు 6.8 శాతం తగ్గి రూ.96,192గా నమోదయ్యాయి. మొత్తం నిర్వహణ ఖర్చుల్లో ఇంధనకోసం పెట్టే ఖర్చు 30 శాతం నుంచి 40 శాతంగా ఉంటుండగా, మరో నిర్వహణ ఖర్చులు 35-50 శాతం స్థాయిలో ఉంటున్నాయని తెలిపింది. వీటిలో విమానాల నిర్వహణ, చమురు, ఇంజిన్ మెంటనెన్స్ కూడా ఉన్నాయి.