ముంబై, జూన్ 12: గుజరాత్లో జరిగిన ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదం.. దేశీయ స్టాక్ మార్కెట్లనూ ప్రభావితం చేసింది. అహ్మదాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నం లండన్‌కు బయలుదేరిన ఫ్లైట్.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)ల్లో నమోదైన ఆయా విమానయాన రంగ కంపెనీల షేర్లు పెద్ద ఎత్తునే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మదుపరులు భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు దిగారు.
దేశీయ విమానయాన రంగ దిగ్గజ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో) షేర్ల విలువ భారీగా క్షీణించింది. ఈ ఒక్కరోజే ఎన్ఎస్ఈలో ఇండిగో స్టాక్ ధర రూ.187 పతనమైంది. ఇది కంపెనీ షేర్ విలువలో 3.3 2 శాతానికి సమానం. చివరకు రూ.5,444 వద్ద స్థిరపడింది. ప్రమాద ఘటనతో విమాన ప్రయాణ రక్షణపై ఏర్పడిన భయాలు ఎయిర్‌లైన్ స్టాక్స్‌ను ఒక్కసారిగా సెల్లింగ్ ప్రెషర్లోకి నెట్టాయని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.
విమానయాన అనుబంధ రంగాల కంపెనీల షేర్లూ నష్టాలకు గురయ్యాయి. యునిమెక్ ఏరోస్పేస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్, తనేజా ఏరోస్పేస్, టాల్ ఎంటర్ప్రైజెస్, ఎం టార్ టెక్నాలజీస్, ఆజాద్ ఇంజినీరింగ్ తదితర కం పెనీల షేర్ల విలువ 4.20 శాతం-1.34 శాతం వరకు పడిపోయింది.
ప్రమాదానికి లోనైన ఎయిర్ ఇండియా విమా నం.. బోయింగ్ సంస్థది కావడంతో సహజంగానే ఆ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. గురువారం అమెరికా స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లో ఒకానొక దశలో 8 శాతం వరకు పడిపోయాయి. ఆ తర్వాత కోలుకున్నా.. 5 శాతం నష్టాల్లోనే కదలాడుతున్నాయి. ఈ ప్రమాదంతో బోయింగ్ విమానాల అమ్మకాలు ప్రభావితం కావచ్చని, ప్రపంచ దేశాల నుంచి ఆర్డర్లు తగ్గిపోవచ్చన్న అంచనాలు ఈ అమెరికా కంపెనీ ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 823.16 పాయింట్లు దిగజారి 81,691.98 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 253.20 పాయింట్లు లేదా 1.01 శాతం కోల్పోయి 24, 888.20 వద్ద స్థిరపడింది. దీంతో వరుస లాభాలకు బ్రేక్ పడ్డైట్టెంది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, మిడిల్ఈస్ట్ దేశాల్లో ఉద్రిక్తతల నడుమ ఉదయం ఆరంభం నుంచే సూచీలు నష్టాల్లో నడిచాయి.
స్టాక్ మార్కెట్ నష్టాలతో ఈ ఒక్కరోజే మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది. బీఎస్ఈ నమోదిత కంపెనీల షేర్ల విలువ రూ.5,98,759.27 కోట్లు హరించుకుపోయింది. దీంతో మదుపరుల సంపద రూ.4,49,58,383.92 కోట్లకు పరిమితమైంది. అంతర్జాతీయ మార్కెట్లు, వీక్లీ ఎఫ్‌అండ్‌వో గడువు ముగియడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్టు చెప్తున్నారు.