Air India | సమ్మర్ హాలీడే సీజన్ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలను సందర్శించాలని భావించే వారికి టాటా సన్స్ (Tata Sons) ఆధీనంలోని ఎయిర్ ఇండియా (Air India) డిస్కౌంట్లు ప్రకటించింది. వచ్చే హాలీడే సీజన్లో (Holiday Season) విమాన ప్రయాణాల గిరాకీని సొమ్ము చేసుకునేందుకు జాతీయ, అంతర్జాతీయ రూట్లలో ‘నమస్తే వరల్డ్ (Namaste World)’ సేల్ ప్రకటించింది. ఈ సేల్లో భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ నెల రెండో తేదీ నుంచి ఆరో తేదీ వరకూ లిమిటెడ్ టైం బుకింగ్స్ ను ఆహ్వానించింది. ఈ ఆఫర్ కింద ఈ నెల 12 నుంచి అక్టోబర్ నెలాఖరు వరకూ ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకోవచ్చు.
జాతీయ రూట్లలో రూ.1499, అంతర్జాతీయ రూట్లలో రూ.12,577 లకు టికెట్లు ఆఫర్ చేస్తోంది. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ టికెట్లకు డిస్కౌంట్లు వర్తిస్తాయి. ఎయిర్ ఇండియా, వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా ఈ నెల రెండో తేదీన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ నెల మూడో తేదీ నుంచి ఎయిర్ ఇండియా టికెట్ ఆఫీసులు, కస్టమర్ కాంటాక్ట్ సెంటర్, ట్రావెల్ ఏజంట్లతోపాటు అన్ని చానళ్లలో ‘నమస్తే వరల్డ్’ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది ఎయిర్ ఇండియా. నమస్తే వరల్డ్ సేల్ కింద సెలెక్టెడ్ రూట్లలో ఫస్ట్ కం ఫస్ట్ వచ్చిన వారికి ఆఫర్లు ఉంటాయి. టికెట్ల ధరలు, ఎక్స్చేంజ్ రేట్లు, స్థానిక పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
* ఎకానమీ క్లాస్ : రూ.1499
* ప్రీమియం ఎకానమీ : రూ.3749
* బిజినెస్ క్లాస్ : రూ.9,999
* ఎకానమీ క్లాస్ : రూ.12,577
* ప్రీమియం ఎకానమీ : రూ.16,213
* బిజినెస్ క్లాస్ : రూ.20,870
అంతే కాదు.. నమస్తే వరల్డ్ సేల్ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఎయిర్ ఇండియా అదనపు సేవింగ్స్ ఆఫర్ చేస్తోంది. మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్న వారికి అంతర్జాతీయ ప్రయాణాలకు రూ.999, జాతీయ ప్రయాణాలకు రూ.399 కన్వీనియన్స్ ఫీజు మాఫీ చేసుకోవచ్చు. బేస్ ఫేర్లపై ప్రోమో కోడ్ `FLYAI` నమోదు చేస్తే రూ.1000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులపై బిజినెస్ క్లాస్ టికెట్లపై రూ.3000 వరకూ, అంతర్జాతీయ రూట్లలో టికెట్లపై స్పెషిపిక్ ప్రోమో కోడ్లను ఉపయోగిస్తే రూ.2500 ఆదా చేసుకోవచ్చు.