ముంబై, ఏప్రిల్ 7 : విమానయానం ఖరీదెక్కుతున్నది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం భారతీయ విమానయాన రంగంపై స్పష్టంగా కనిపిస్తున్నదిప్పుడు. అంతర్జాతీయ మార్కెట్లో విజృంభిస్తున్న క్రూడాయిల్ రేట్లు.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) వాల్యూను ఎగదోస్తున్నాయి మరి. దీంతో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీస్‌లపై ఇంధన సర్చార్జ్ను విధించాలని ఎయిర్ ఇండియా కూడా మంగళవారం నిర్ణయించింది. ఇప్పటికే ఇండిగో ఈ మేరకు సవరణలు చేసింది. కాగా, దేశీయ విమానాల్లో ప్రయాణించేవారి టికెట్ ధరలపై రూ.299 నుంచి రూ.899 వరకు ఇంధన సర్చార్జ్ను వేయబోతున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. అలాగే అంతర్జాతీయ విమానాల్లో ఇది 24 డాలర్ల నుంచి 280 డాలర్ల మేరకు (కొన్ని మార్గాలు మినహా) ఉండనున్నది. బుధవారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో కంపెనీ తెలిపింది. ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ, చౌక విమానయాన విభాగం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకూ సర్‌చార్జ్ భారం తప్పదు.
కాగా, బంగ్లాదేశ్‌తోపాటు జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా వంటి దేశాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలపై ఇంధన సర్‌చార్జ్.. అవసరమైన రెగ్యులేటరీ అప్రూవల్స్కు లోబడి ఉంటాయని ఎయిర్ ఇండియా వెల్లడించింది. అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) తాజా వివరాల ప్రకారం మార్చి 27తో ముగిసిన వారంలో సగటున బ్యారెల్ ఏటీఎఫ్ ధర 195.19 డాలర్లకు చేరిందని ఎయిర్ ఇండియా తెలియజేసింది. ఫిబ్రవరి ఆఖర్లో 99.40 డాలర్లుగానే ఉన్నట్టు వివరించింది. నెల రోజుల్లో దాదాపు 100 శాతం పెరుగుదల నమోదైనట్టు పేర్కొన్నది. ఇప్పటికే పెరిగిన ఇంధన ధరల వల్ల పడుతున్న భారాన్ని చాలావరకు మోశామని, ఇక తప్పకనే ప్రయాణికులపై వేయాల్సి వస్తున్నదని ఎయిర్ ఇండియా ఈ సందర్భంగా చెప్తున్నది. కాగా, ఎయిర్‌లైన్స్ మొత్తం ఖర్చులో సుమారు 40-45 శాతం వాటా ఏటీఎఫ్‌దే. అయితే అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మొదలవక ముందు బ్యారెల్ క్రూడాయిల్ 27.83 డాలర్లుగా ఉంటే.. మార్చి 27 నాటికి అది 81.44 డాలర్లకు చేరింది. క్రూడాయిల్‌ను శుద్ధి చేయడం ద్వారానే ఏటీఎఫ్ వస్తుందన్న విషయం తెలిసిందే. దీంతో ఈ జెట్ ఫ్యూయల్ రేటూ పెరిగిపోయింది.
తమ సంస్థ సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా చేసినట్టు మంగళవారం ఎయిర్ ఇండియా ప్రకటించింది. దీంతో కొత్త సారథిని అన్వేషించడానికి ఓ కమిటీని వేసినట్టు ఈ టాటా గ్రూప్ సంస్థ తెలిపింది. న్యూజీలాండ్‌కు చెందిన విల్సన్.. గతంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేశారు. ఆ అనుభవంతోనే ఎయిర్ ఇండియా సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపట్టారు. కాగా, 2024లోనే ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు తాను 2026లో తప్పుకొంటానని విల్సన్ చెప్పినట్టు ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది. నిజానికి 2022 సెప్టెంబర్‌లో ఎయిర్ ఇండియా పగ్గాలను చేపట్టిన విల్సన్.. ఇంకా కొంతకాలం కొనసాగాల్సి ఉన్నది. ఈ క్రమంలోనే నూతన సీఈవో, ఎండీ వచ్చేదాకా విల్సన్ ఆ పదవిలోనే ఉండనున్నారు. కాగా, గత ఏడాది జూన్‌లో అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కాసేపటికే కుప్పకూలిన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.
అప్పట్నుంచి విల్సన్ పలు సందర్భాల్లో విమర్శల్ని ఎదుర్కొన్న సంగతి విదితమే. అయినప్పటికీ ఈ రాజీనామా నేపథ్యంలో విల్సన్ సేవలను, ఆయన సారథ్యంలో ఎయిర్ ఇండియా పనితీరును చంద్రశేఖరన్ కొనియాడారు. మరోవైపు ఎయిర్ ఇండియా మున్ముందు వృద్ధిపథంలో నడిచేందుకు మరో సారథి రావాలంటే తాను తప్పుకోవాల్సిన సమయం ఇదేనని విల్సన్ అన్నారు. అయితే గత నెల 19 నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కూ సారథి కరువయ్యారు. ఎండీ అలోక్ ఐదేండ్ల పదవీకాలం ముగియడంతో ఆ స్థానం ఖాళీగానే ఉంటున్నది. ఈ క్రమంలో విల్సన్ రాజీనామా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఎయిర్ ఇండియా.. ప్రైవేటీకరణలో భాగంగా టాటాల చేతికి వచ్చిన దగ్గర్నుంచి విల్సన్ నాయకత్వంలోనే నడుస్తున్నది.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మొదలైన దగ్గర్నుంచి పశ్చిమాసియా దేశాలకు 10వేలకుపైగా భారతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ మేరకు మంగళవారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అసంగ్బ చుబా ఓ తెలిపారు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలకు ముందు భారత్ నుంచి రోజూ దాదాపు 300-350 విమాన సర్వీసులు నడిచేవని, ఇప్పుడు రోజుకు 80-90 విమానాలు మాత్రమే వెళ్తున్నాయని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేయడంతో మిడిల్ ఈస్ట్ సంక్షోభం మొదలైంది. అప్పట్నుంచి ఇరాన్, ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, కువైట్, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్ దేశాలకు విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతున్నది. దాడుల దృష్ట్యా ఆయా దేశాలు విధించిన గగనతల ఆంక్షలు, ఇతరత్రా భయాలు ఇందుకు కారణం.