Air India Express | టాటా సన్స్ అనుబంధ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ (Air India Express) దేశీయ విమాన ప్రయాణ నెట్వర్క్ బలోపేతం దిశగా అడుగులేస్తున్నది. కోల్‌కతా, చెన్నైలతోపాటు కొత్త రూట్లలో ఆరు రోజువారీ విమాన సర్వీసులు నడుపనున్నది. కోల్ కతా నుంచి రెండు, చెన్నై నుంచి మూడు, గువాహటి- జైపూర్ సెక్టార్ మధ్య ఒక విమాన సర్వీసు నడుపుతామని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ మంగళవారం తెలిపింది. చెన్నై-భువనేశ్వర్, చెన్నై-బాగ్దొగ్రా, చెన్నై-తిరువనంతపురం, కోల్‌కతా- వారణాసి, కోల్‌కతా – గువాహటి, గువహాటి- జైపూర్‌లకు విమాన సర్వీసులు నడుపుతుంది.
కోల్‌కతా – వారణాసి విమానం ఉదయం 7.40 గంటలకు టేకాఫ్ అవుతుంది. వారణాసికి 9.05 గంటలకు చేరుతుంది. తిరిగి 9.40 గంటలకు వారణాసిలో టేకాఫ్ అయి కోల్ కతాకు 11.10 గంటలకు చేరుతుంది. కోల్ కతా -గువాహటి విమాన సర్వీసు మధ్యాహ్నం 12.10 గంటలకు టేకాఫ్ అయి గువాహాటికి 1.25 గంటలకు చేరుతుంది. తిరిగి గువాహాటి నుంచి మధ్యాహ్నం 1.55 గంటలకు టేకాఫ్ అయి కోల్ కతాకు సాయంత్రం 4.35 గంటలకు చేరుతుంది.
గువాహటి-జైపూర్ మధ్య ఎక్స్‌క్లూజివ్‌గా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కొత్త సర్వీసును ప్రారంభిస్తున్నది. చెన్నై – తిరువనంతపురం మధ్య వారంలో రెండు విమాన సర్వీసులు నిర్వహిస్తున్నప్పటికీ, డిమాండ్ పెరుగుతుండటంతో మరో సర్వీసు ప్రారంభిస్తోంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ రోజువారీగా 82 విమానాలతో 380కి పైగా విమాన సర్వీసులు నిర్వహిస్తున్నది.