హైదరాబాద్, జూలై 12: హైదరాబాద్‌కు చెందిన అగ్రీ ఫిన్‌టెక్ స్టార్టప్ హెసా.. గ్రామీణస్థాయి ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఆర్థికపరమైన అంశాల్లో అండగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ ఏడాది ఆఖరుకల్లా దేశంలోని 30వేల గ్రామాల్లో 60వేలకుపైగా స్థానిక ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఫైనాన్షియల్ సొల్యూషన్స్‌ను అందించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నట్టు మంగళవారం తెలిపింది. బిల్లుల చెల్లింపులు, నగదు ఉపసంహరణకు ఖాతాలు తెరవడంతోపాటు మొబైల్ రిచార్జ్, బస్ టికెట్ బుకింగ్, డిమ్యాట్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు తెరవడం, విద్యుత్తు బిల్లుల చెల్లింపుల వంటి సేవల్నీ అందిస్తామని వెల్లడించింది. గ్రామాల్లో జరిగే క్రయవిక్రయాలకు మా సాంకేతిక పరిజ్ఞానం కూడా తోడవనుందని ఈ సందర్భంగా కంపెనీ పేర్కొన్నది. ‘మా సేవలతో గ్రామీణ భారతం సాధికారతను కోరుకుంటున్నాం. ప్రస్తుతం నెలకు మా హెసా వేదికపై 15 లక్షలకుపైగా లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 30 లక్షలకు చేర్చాలని ప్రయత్నిస్తున్నాం’ అని హెసా ప్రధాన వ్యూహాత్మక అధికారి, ఫిన్‌టెక్ అధిపతి రిషభ్ షా అన్నారు.