హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : బొగ్గు సరఫరాపై సింగరేణి, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) సంస్థల మధ్య నాలుగు కీలక ఒప్పందాలు జరిగాయి. కంపెనీ సీఎండీ ఎన్ శ్రీధర్ ఆదేశాల మేరకు కోల్ మూవ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జే అల్విన్ ఆధ్వర్యంలో జరిగిన కీలక ఒప్పందాలపై సింగరేణి మార్కెటింగ్ జీఎం కే సూర్యనారాయణ, ఎన్టీపీసీ సౌత్ అండ్ వెస్ట్రన్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేబాశిష్ ఛటోపాధ్యాయలు సంతకాలు చేశారు.
ఈ ఒప్పందంలో భాగంగా ఎన్టీపీసీ కర్ణాటకలో నిర్వహిస్తున్న కుడిగీ థర్మల్ విద్యుత్ కేంద్రానికి సింగరేణి ఏటా 67.5 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడంతోపాటు మహారాష్ట్రలోని 660 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరా సామర్థ్యాన్ని ఏడాదికి 28.2 లక్షల టన్నులకు పెంచనున్నది. అలాగే ముందస్తు చెల్లింపులకోసం మరో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.