Higher EPS Pension | అధిక పెన్షన్ కోసం ఉద్యోగుల ఆప్షన్ మీద కేంద్రం దిగి వచ్చింది. రూ.15 వేలకు పైగా వేతనం గల ఉద్యోగులు.. అధిక పెన్షన్ కోస్ వేతనంలో 1.16 శాతం అదనంగా చెల్లించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నది. మేనేజ్మెంట్ వాటా నుంచే ఈ 1.16 శాతం వాటాను ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (Employees’ Provident Fund Organisation-EPFO) సమీకరిస్తుందని కార్మికశాఖ తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ నిబంధన సవరించామని వివరించింది. దీని ప్రకారం ఎంప్లాయ్ ప్రావిడెండ్ ఫండ్‌కు యాజమాన్యాలు చెల్లించే 12 శాతం వాటా నుంచే ఈ అదనపు 1.16 శాతం ఉద్యోగుల పెన్షన్ పథకానికి కేటాయిస్తారు. దీని ప్రకారం అధిక పెన్షన్ కోసం ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు రూ.15 వేలకు పైగా వేతనంపై 1.16 శాతం వాటా చెల్లించనవసరం లేదు. ఈ మేరకు కార్మికశాఖ ఈ నెల మూడో తేదీన రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది.
ఇంతకుముందు 2014 సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ ఫండ్ పథకానికి ఈపీఎఫ్ఓ సవరణలు తెచ్చింది. 2014కు ముందు అధిక పెన్షన్ కోసం అదనపై వేతనంపై మేనేజ్మెంట్ తో కలిసి 11 (3) పేరా కింద ఉమ్మడి ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులంతా.. 11 (4) పేరా కింద మళ్లీ ఆరు నెలల్లో ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలని ఈపీఎఫ్ఓ కోరింది. అలా గడువు లోపు ఆప్షన్ ఇవ్వని వారు అధిక పెన్షన్ అవకాశాన్ని కోల్పోయినట్లేనని తెలిపింది. అంతే కాదు అధిక పెన్షన్ కోరుకునే వారు రూ.15 వేలకు పైగా వేతనంపై 1.16 శాతం చొప్పున తన వంతు వాటాగా ఉద్యోగులే చెల్లించాలన్న షరతు తీసుకొచ్చింది ఈపీఎఫ్ఓ.
ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ఉద్యోగుల వేతనం నుంచే అదనంగా పెన్షన్ వాటా తీసుకోవడం సామాజిక భదత్రా నిబంధనలకు వ్యతిరేకం అని స్పష్టం చేసింది. పెన్షన్ ఫండ్ కోసం అదనపు పేమెంట్ నిర్ణయాన్ని ఆరు నెలల పాటు నిలిపేస్తున్నట్లు గత నవంబర్ నెలలో తీర్పు చెప్పింది. అధిక పెన్షన్ ఇవ్వడానికి అవసరమైన నిధులను ఇతర మార్గాల్లో సమీకరించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా యాజమాన్యం కోటా నుంచే పెన్షన్ ఫండ్ కు 1.16 శాతం వాటా కేటాయించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది.
మామూలుగా ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)కి యాజమాన్యాల వాటా కింద జమ చేసే 12 శాతంలో 8.33 శాతం ఈపీఎస్ లోకి వెళుతుంది. మిగతా 3.67 శాతం ఉద్యోగి (ఈపీఎఫ్) ఖాతాలో డిపాజిట్ చేసేవారు. కానీ, తాజాగా ఈపీఎఫ్ఓ తీసుకున్న నిర్ణయం ప్రకారం యాజమాన్యం డిపాజిట్ చేస్తున్న 12 శాతం వాటా నుంచే అదనపు 1.16 శాతం వాటా చెల్లింపు కూడా ఉంటుంది. దీంతో యాజమాన్యం నుంచి ఈపీఎస్ కింద వసూలు చేసే 8.33 శాతం వాటా 9.49 శాతానికి పెరుగుతుంది.