Adani on NDTV | భారతీయ బిలియనీర్ గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ అన్నంత పని చేసింది. ప్రముఖ టీవీ చానెల్ నెట్వర్క్.. ఎన్డీటీవీ గ్రూప్లో 26 శాతం వాటాల కొనుగోలు కోసం అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ తేదీలు ప్రకటించింది. వచ్చే నెల 17వ తేదీన మొదలై నవంబర్ ఒకటో తేదీన ఈ ఓపెన్ ఆఫర్ ముగుస్తుందని జేఎం ఫైనాన్సియల్ గురువారం వెల్లడించింది.
అదానీ గ్రూప్ ఈ ఓపెన్ ఆఫర్లో షేర్ విలువ రూ.294 చొప్పున 1.67 కోట్ల ఈక్విటీ షేర్లు కొనుగోలు చేస్తామని తెలిపింది. పూర్తిగా షేర్లు సబ్స్క్రైబ్ అయితే రూ.492.81 కోట్లకు చేరుతుందని వివరించింది. గత నెల 23న ఎన్డీటీవీలో మెజారిటీ వాటాలను కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది.
ఎన్డీటీవీకి గతంలో వీసీపీఎల్ సంస్థ ఇచ్చిన రుణానికి సమానంగా 29.18 శాతం వాటాలను కేటాయించారు. వీసీపీఎల్ను పూర్తిగా టేకోవర్ చేయడంతో ఎన్డీటీవీలో 29.18 శాతం వాటా అదానీ గ్రూప్ సొంతమైంది. మెజారిటీ వాటా షేర్లను కొనుగోలు చేసిన నేపథ్యంలో అదానీ గ్రూప్ తాజాగా నిబంధనల మేరకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.