న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: గడిచిన ఏడాది కాలంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద రెట్టింపునకుపైగా ఎగిసింది. ఏకంగా 116 శాతం ఎగబాకినట్టు ఈ ఏడాదికిగాను బుధవారం విడుదలైన ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా సంపన్నుల జాబితాలో తేలింది. రూ.5.89 లక్షల కోట్లు పెరిగి రూ.10.94 లక్షల కోట్లకు చేరినట్టు హురున్ ఇండియా తెలియజేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ సంపద నిరుడుతో చూస్తే 11 శాతం వృద్ధితో రూ.7.95 లక్షల కోట్లుగా ఉన్నట్టు హురున్ వెల్లడించింది. ఈ ఏడాది కాలంలో రూ.76,700 కోట్లు పెరిగింది.
అంబానీ వర్సెస్ అదానీ
దేశంలోనే అత్యంత ధనవంతుడి హోదా కోసం అంబానీ, అదానీల మధ్య నెలకొన్న రేసు రసవత్తరంగా కొనసాగుతున్నది. ఈ ఇద్దరు గుజరాతీల సంపద మధ్య తేడా ఏడాదిలో లక్షల కోట్ల రూపాయల్లోకే చేరింది మరి. ముకేశ్ అంబానీ సంపద కంటే గౌతమ్ అదానీ సంపద ఇప్పుడు దాదాపు రూ.3 లక్షల కోట్లు అధికంగా ఉన్నది. నిజానికి ఏడాది క్రితం అదానీ కంటే అంబానీ సంపదే రూ.2 లక్షల కోట్లు ఎక్కువ. ఇప్పుడు అదే అదానీతో చూస్తే అంబానీ సంపద రూ.3 లక్షల కోట్లు తక్కువ. అంతేగాక గడిచిన ఐదేండ్లలో అదానీ సంపద 1,440 శాతం పెరగడం గమనార్హం. ఇదే సమయంలో అంబానీ సంపదలో వృద్ధి 115 శాతం మాత్రమే. దీంతో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లోనూ అదానీ సంపద జెట్ స్పీడుతో పరుగులు పెట్టడం ఇప్పుడు అటు మార్కెట్ వర్గాల్లో, ఇటు వ్యాపార, పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రోజువారీ సంపాదనలోనూ..
రోజువారీ సంపాదనలోనూ అంబానీ, అదానీల మధ్య వ్యత్యాసం విపరీతంగా ఉన్నది. ఏడాది క్రితం వరకు భారత కుబేరుడిగా ఏండ్ల తరబడి ముకేశ్ అంబానీనే కొనసాగిన సంగతి విదితమే. అయితే గడిచిన ఏడాది కాలంలో అదానీ తెరపైకి వచ్చారు. అదానీ హవా ఎంతగా ఉందంటే అంబానీతో పోల్చితే రోజువారీ సంపాదన సుమారు 800 శాతం పెరిగేలా ఉన్నది. గడిచిన ఏడాది కాలంలో అదానీ సంపాదన రోజుకు 1,612 కోట్లుగా ఉంటే, అంబానీ సంపాదన కేవలం రూ.210 కోట్లే. 2012లో ముకేశ్ అంబానీ సంపదలో గౌతమ్ అదానీ సంపద ఆరింట ఒక వంతు మాత్రమే. కానీ ఎవరూ ఊహించనివిధంగా పదేండ్లలో అంబానీనే అదానీ దాటేశారు. ఈ క్రమంలోనే దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న అదానీ.. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ముకేశ్ అంబానీ దేశీయంగా రెండో స్థానంలో, ప్రపంచ ర్యాంకుల్లో పదో స్థానంలో ఉన్నారు.
హురున్ జాబితా విశేషాలు
తెలుగు రాష్ట్రాల్లో 78 మంది
తెలుగు రాష్ట్రాల్లో శ్రీమంతుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. హురున్ ఇండియా సంపన్న వర్గాల 2022 జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి 78 మందికి చోటు లభించింది. వెయ్యి కోట్ల రూపాయల కంటే అధిక సంపద కలిగిన వారితో ఈ జాబితాను రూపొందించింది. వీరి మొత్తం సంపద రూ.3,90,500 కోట్లుగా ఉన్నదని పేర్కొంది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా 11 మంది చేరగా, వీరిలో ఇద్దరు మహిళలు ఉండటం విశేషం. రూ.56,200 కోట్ల సంపదతో దివీస్ ల్యాబ్ చైర్మన్ మురళీ దివీస్ తొలి స్థానంలో నిలవగా.. రూ.8,700 కోట్లతో మహిమా దాట్ల మహిళా సంపన్నురాలిగా నిలిచారు.
