న్యూఢిల్లీ, జూలై 26: దేశంలో అదానీ గ్రూప్ పెట్టుబడులు నెమ్మదించడమో లేక ఆగిపోవడమో జరగదని ఆ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. భారత్‌లో అదానీ గ్రూప్ పెట్టుబడులు కొనసాగుతూనే ఉంటాయని ఈ దేశీయ అపర కుబేరుడు స్పష్టం చేశారు. మంగళవారం గ్రూప్ సంస్థల వార్షిక వాటాదారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే కొత్తతరం ఇంధన వ్యాపారంలో ప్రకటించిన 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. భారత్‌ను నికర చమురు, గ్యాస్ దిగుమతిదారు నుంచి క్లీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా నిలబెట్టగలవన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే భారత విజయగాథలో అదానీ గ్రూప్ పాత్ర తప్పక ఉంటుందనీ తెలిపారు. దేశాభివృద్ధికి అనుగుణంగానే తమ గ్రూప్ విజయాలుంటాయని పేర్కొన్నారు. ‘భారత్‌లో పెట్టుబడులకు మేము ఎప్పటికీ దూరంగా ఉండబోం. దేశంలో మా పెట్టుబడులూ నెమ్మదించవు. ఇక మార్కెట్ పరిస్థితులనుబట్టి మా వ్యాపార విస్తరణ ఉంటుంది’ అని తెలియజేశారు. కాగా, 1988లో ఓ కమోడిటీ ట్రేడర్‌గా మొదలైన అదానీ ప్రస్థానం.. ఓడరేవులు, బొగ్గు, విద్యుత్తు, విమానాశ్రయాలు, డాటా సెంటర్లు, వంటనూనెలు ఇలా విస్తరిస్తూ పోతున్న విషయం తెలిసిందే. దేశ, విదేశాల్లోనూ వ్యాపార సామ్రాజ్యాన్ని అదానీ గ్రూప్ వ్యాప్తి చెస్తున్నది.