Adani on NDTV | ఎన్డీటీవీలో అదనపు 26 శాతం వాటా కొనుగోలుకు ఓపెన్ ఆఫర్‌కు కట్టుబడి ఉన్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. తమ డ్రాఫ్ట్ ఓపెన్ ఆఫర్ లెటర్‌పై అభిప్రాయాలు తెలుపాల్సిందిగా సెబీని అదానీ గ్రూప్ కోరింది. ఈ నెల 17 నుంచి ఎన్డీటీవీ గ్రూప్‌లో అదనపు 26 శాతం వాటా కొనుగోలు చేయడానికి మైనారిటీ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ అమలు చేస్తామని ఇంతకుముందు అదానీ గ్రూప్ ప్రకటించింది. కానీ, ఆచరణలో అది పూర్తి కాలేదు. దశాబ్ది క్రితం విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీసీపీఎల్) వద్ద తీసుకున్న రూ.400 కోట్ల రుణానికి ఎన్డీటీవీ 29.18 శాతం వారంట్లు జారీ చేసింది. ఏ సమయంలోనైనా ఈ వారంట్లను వాటాలుగా మార్చుకునేందుకు వీసీపీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది ఎన్డీటీవీ.
వీసీపీఎల్‌ను తొలుత టేకోవర్ చేసిన అదానీ గ్రూప్.. ఎన్డీటీవీ గ్రూప్‌లో వీసీపీఎల్ వాటాపై హక్కులు కోరింది. పూర్తి యాజమాన్య హక్కులు పొందడానికి 26శాతం అదనపు వాటా కొనుగోలు చేయడానికి ఈ నెల 17నుంచి మైనారిటీ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రతిపాదించింది. రూ.294లకు 26శాతం లేదా 1.67 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేస్తామని అదానీ ఎంటర్ ప్రైజెస్, ఏఎంజీ మీడియా నెట్వర్క్స్తో కలిసి వీసీపీఎల్ క్లయిమ్ చేసింది.
బుధవారం బీఎస్ఈలో ఎన్డీటీవీ షేర్లు రూ.332.90 వద్ద క్లోజయింది. ఓపెన్ ఆఫర్ మీద ఎన్డీటీవీ షేర్ ధర 13 శాతం పెరిగింది. ఎన్డీటీవీలో 26 శాతం వాటా కొనుగోలు ఓపెన్ ఆఫర్‌పై జేఎం ఫైనాన్సియల్ నిర్వాహక సంస్థగా ఉంది. ఎన్డీటీవీ ప్రమోటర్ గ్రూప్.. రాధికారాయ్ ప్రణయ్‌రాయ్ (ఆఆర్పీఆర్) గ్రూప్ వైఖరి కారణంగా వీసీపీఎల్‌కు వాటాల బదిలీ ప్రక్రియ పూర్తి కాలేదు. సెబీ నిబంధనలకు లోబడి ఓపెన్ ఆఫర్‌కు కట్టుబడి ఉన్నాం అని వీసీపీఎల్ తెలిపింది. సెబీతోపాటు ఆదాయం పన్ను (ఐటీ) విభాగం అనుమతి లేకుండా వీసీపీఎల్‌కు వాటాల బదిలీపై ముందుకెళ్లడం కుదరదని ఎన్డీటీవీ గ్రూప్ పేర్కొన్నది. తమకు సమాచారం, అనుమతి లేకుండా తమ సంస్థ వాటాల టేకోవర్ ప్రక్రియ సాగిందని ఎన్డీటీవీ చెబుతున్నది.