Adani on NDTV | తమ సంస్థ ప్రమోటర్ల మెజారిటీ వాటా విక్రయించడానికి ఆదాయం పన్నుశాఖ ఆమోదం తప్పనిసరి అన్న ఎన్డీటీవీ ప్రకటనను అదానీ గ్రూప్ తిరస్కరించింది. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన న్యూస్ చానెల్‌ను టేకోవర్ చేసే విషయమై ఎన్డీటీవీ, అదానీ గ్రూప్ మధ్య ఘర్షణ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇండిపెండెంట్ మీడియా సంస్థగా పేరొందిన ఎన్డీటీవీలో మెజారిటీ వాటాను టేకోవర్ చేయడానికి భారతీయ కుబేరుడు గౌతం అదానీ గత వారం ప్రణాళిక వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు, గురువారం స్టాక్ మార్కెట్లలో ఎన్డీటీవీ షేర్ అనుమతించిన పరిమితి ఐదు శాతాన్ని దాటి14 ఏండ్ల గరిష్టానికి చేరుకున్నాయి.
ఎన్డీటీవీ నెట్వర్క్ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ తమ వాటాలను విక్రయించకుండా 2017లో ఆదాయం పన్ను శాఖ నిషేధం విధించిందని బుధవారం అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటించింది. ఎన్డీటీవీ సబ్మిట్ చేసిన ఐటీ రిటర్న్స్‌ను తిరిగి అంచనా వేయాల్సి ఉందని ఆదాయం పన్నుశాఖ తెలిపిందని గుర్తు చేసింది.
కానీ, అదానీ గ్రూప్ మాత్రం ఆదాయం పన్నుశాఖ ఆమోదం అవసరం లేదని గురువారం పేర్కొంది. మెజారిటీ వాటాను టేకోవర్ చేయకుండా ఎన్డీటీవీ ప్రమోటర్లు అతిగా జాప్యం చేస్తున్నారని వ్యాఖ్యానించింది.