న్యూఢిల్లీ, ఆగస్టు 19: డీబీ పవర్ లిమిటెడ్‌ను సొంతం చేసుకోబోతున్నట్టు అదానీ పవర్ లిమిటెడ్ శుక్రవారం తెలిపింది. రూ.7,017 కోట్ల విలువగట్టి పూర్తిగా సంస్థను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం నగదు లావాదేవీల్లోనే కొనుగోలు ప్రక్రియ జరుగనున్నట్టు బీఎస్ఈకి అదానీ తెలియజేసింది. కాగా, డీబీ పవర్‌కు చత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్ చంపా జిల్లాలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 థర్మల్ విద్యుదుత్పాదక కేంద్రాలున్నాయి. ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియాతో డీబీ పవర్‌కు బొగ్గు సరఫరా ఒప్పందాలున్నాయి. అలాగే 923.5 మెగావాట్లకు సంబంధించి దీర్ఘ, మధ్యకాలిక విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలనూ ఈ కంపెనీ చేసుకున్నది. ప్రస్తుతం ఈ సంస్థ లాభాల్లోనే ఉన్నట్టు అదానీ పవర్ స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరం డీబీ పవర్ టర్నోవర్ 3,488 కోట్లుగా ఉన్నది. ఇక ఈ ఏడాది అక్టోబర్ ఆఖరుకల్లా డీల్ పూర్తిగావచ్చన్న విశ్వాసాన్ని అదానీ పవర్ వ్యక్తం చేసింది.
ఆఫర్లకు సెబీ గ్రీన్‌సిగ్నల్
సిమెంట్ దిగ్గజ కంపెనీలు గుజరాత్ అంబూజా, ఏసీసీలను ఇటీవల చేజిక్కించుకున్న అదానీ గ్రూప్ ఆ కంపెనీల్లో వాటాను మరింత పెంచుకునేందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ రెండు కంపెనీల్లో 26 శాతం చొప్పున రూ.31,139 కోట్ల విలువైన పబ్లిక్ వాటాను కొనుగోలు చేసేందుకు గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్లను జారీచేయనుంది. భారత కార్పొరేట్ చరిత్రలోనే ఈ రెండూ అతిపెద్ద ఓపెన్ ఆఫర్లు. ఒక్కో అంబూజా సిమెంట్ షేరును రూ.385 ధరతో 26 శాతం వాటాను కొనేందుకు రూ.19,880 కోట్లు, ఏసీసీ షేరును రూ. 2,300 ధరతో 26 శాతం వాటా కొనుగోలుకు రూ. 11,259 కోట్లు అదానీ కుటుంబం పెట్టుబడి చేయనుంది. ఈ ఓపెన్ ఆఫర్లు పూర్తయితే అంబూజాలో అదానీ వాటా 89.11 శాతానికి, ఏసీసీలో 80.53 శాతానికి చేరుతుంది.