Adani-NDTV | ఎన్డీటీవీ టేకోవర్ కోసం తమ ఓపెన్ ఆఫర్లో ఆ సంస్థ షేర్లు విక్రయించిన వాటాదారులకు అదానీ గ్రూప్ తీపి కబురందించింది. ఎన్డీటీవీ ఫౌండర్ల షేర్లతో సమానంగా ఓపెన్ ఆఫర్లో విక్రయించిన షేర్ ధర చెల్లిస్తామని మంగళవారం తెలిపింది. గతేడాది నవంబర్ 22 నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు ఓపెన్ ఆఫర్లో షేర్లు విక్రయించిన ఇన్వెస్టర్లకు ఎన్డీటీవీ షేర్‌పై అదనంగా రూ.48.65 పే చేస్తామని పేర్కొంది. ఎన్డీటీవీ ఫౌండర్లు రాధికారాయ్, ప్రణయ్ రాయ్‌లు తమ వాటాలో మెజారిటీ అదానీ గ్రూప్‌కు విక్రయించిన సంగతి తెలిసిందే. వారికి ఒక్కో షేర్‌పై అదానీ గ్రూప్ రూ.342.65 చెల్లించింది.
సెబీ నిబంధనల ప్రకారం ఒక సంస్థను టేకోవర్ చేయడానికి చెల్లించిన ధర.. మైనారిటీ వాటాదారులకు కూడా వర్తిస్తుందని ఇన్‌గవర్న్ రీసెర్చ్ సర్వీసెస్ ఎండీ శ్రీరామ్ సుబ్రమణ్యం తెలిపారు. ఓపెన్ ఆఫర్లో ఇన్వెస్టర్లు రూ.294లకు 5.3 మిలియన్ల షేర్లు విక్రయించారు. ప్రణయ్ రాయ్ దంపతుల వాటాతో ఎన్డీటీవీలో అదానీ వాటా సుమారు 65 శాతానికి చేరుకున్నది. రాయ్‌లు గతవారం తమ 27.26 శాతం అదానీ గ్రూప్‌కు విక్రయించిన సంగతి తెలిసిందే.