Adani Group M-Cap | బిలియనీర్ గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ మరింత ఆవిరైంది. సోమవారం అదానీ గ్రూప్ సంస్థల స్టాక్స్ మరింత పతనం కావడంతో వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19.19 లక్షల కోట్ల నుంచి రూ.7.15 లక్షల కోట్లకు చేరుకుంది. జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వచ్చినప్పటి నుంచి అదానీ గ్రూప్ 63 శాతానికి పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది.
అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.46 లక్షల కోట్లు హరించుకుపోయింది. అదానీ టోటల్ గ్యాస్ రూ.3.48 లక్షల కోట్లు, అదానీ ట్రాన్స్మిషన్ రూ.2.32 లక్షల కోట్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.2.29 లక్షల కోట్లు నష్టపోయాయి. అదానీ పవర్ రూ.42,522 కోట్లు, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ రూ.51,413 కోట్లు, అంబుజా సిమెంట్స్ రూ.31,542 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి.
అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ సోమవారం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో 6.37 శాతం నష్టంతో రూ.1,231.80 వద్ద నిలిచింది. నెల రోజుల్లో 64 శాతం వాటా నష్టపోయింది. అదానీ గ్రూప్ సిమెంట్ యూనిట్ అంబుజా సిమెంట్స్ 3.42 శాతం నష్టంతో రూ.333.30 వద్ద ట్రేడ్ అయింది. నెలలో అంబుజా సిమెంట్స్ 33 శాతం విలువ కోల్పోయింది.
నెల రోజుల్లోనే అదానీ పవర్ అండ్ అదానీ విల్మార్ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో దాదాపు ఐదు శాతం నష్టాలతో ట్రేడయ్యాయి. అదానీ పవర్ షేర్ 49 శాతం, అదానీ విల్మార్ షేర్ దాదాపు 40 శాతం ఆవిరైంది. మరో సిమెంట్ గ్రూప్ ఏసీసీ షేర్ 2.77 శాతం నష్టంతో రూ.1,681.55 వద్ద ట్రేడ్ కాగా, నెలలో ఏసీసీ షేర్లు 28 శాతం పతనం అయ్యాయి. ఇటీవలే టేకోవర్ చేసిన మీడియా సంస్థ ఎన్డీటీవీ స్టాక్ సైతం 4.98 శాతం విలువ పతనంతో రూ.181.20 వద్ద ట్రేడ్ అయింది. గత నెల రోజుల్లోనే ఎన్డీటీవీ షేర్ 36 శాతం కోల్పోయింది.
ఇదిలా ఉంటే అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు వాటి ఐదు శాతం లోయర్ సర్క్యూట్ వద్ద లాక్ అయ్యాయి. అదానీ గ్రూప్ సంస్థల్లో అదానీ పోర్ట్స్ మాత్రమే లాభాల్లో సాగుతున్నది. అదానీ పోర్ట్స్ 0.41 శాతం లాభంతో రూ.561.20 వద్ద ట్రేడయింది. తిరిగి ఇన్వెస్టర్ల విశ్వాసం కూడగట్టుకునేందుకు అదానీ గ్రూప్.. రుణాల చెల్లిస్తూనే, హిండెన్‌బర్గ్‌పై టాప్ యూఎస్-షెల్ఫ్ క్రైసిస్ కమ్యూనికేషన్స్ అండ్ లీగల్ టీమ్స్‌తో పోరాటానికి సిద్ధం అవుతున్నది.