Adani Group | న్యూఢిల్లీ, మార్చి 2: నాలుగు కంపెనీల్లో కొద్దిమేర వాటాలను అదానీ గ్రూప్ అమ్మేసింది. అమెరికన్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ బొటిక్ జీక్యూజీ పార్ట్నర్స్కు రూ.15,446 కోట్లకు ఈ వాటాలను విక్రయించింది. సెకండరీ మార్కెట్ బ్లాక్ డీల్స్ ద్వారా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ ఎంటర్ప్రైజెస్ కంపెనీల్లోని ఈ వాటాల అమ్మకం జరిగినట్టు గురువారం గ్రూప్ ఓ ప్రకటనలో తెలియజేసింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రమోటర్ల వాటా 72.6 శాతంగా ఉన్నది. ఇందులో రూ.5,460 కోట్లకు 3.39 శాతం వాటాను జీక్యూజీ పార్ట్నర్స్కు అమ్మేశారు. అలాగే ఏపీసెజ్‌లో ఉన్న తమ 66 శాతం వాటాలో రూ.5,282 కోట్లకు 4.1 శాతం వాటాను అదానీ గ్రూప్ అమ్మేసింది. అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 73.9 శాతం వాటా ప్రమోటర్లకు ఉండగా, రూ. 1,898 కోట్లతో 2.5 శాతం వాటాను జీక్యూజీ పార్ట్నర్స్ కొన్నది. అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ అదానీకి 60.5 శాతం వాటా ఉండగా, రూ. 2,806 కోట్లకు 3.5 శాతం వాటా ను అమ్మేశారు. ఈ కంపెనీల షేర్లన్నీ దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన విషయం తెలిసిందే. ఇక అదానీ గ్రూప్ రుణ భారం రూ.2.21 లక్షల కోట్లుగా ఉన్నది. వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్లా ఇందులో దాదాపు 8 శాతం చెల్లింపులు జరుగాపాల్సి ఉన్నది.
అదానీ గ్రూప్ కంపెనీల్లో తాజాగా పెట్టుబడులు పెట్టిన జీక్యూజీ పార్ట్నర్స్ వెనుక భారత మూలాలే ఉండటం గమనార్హం. సంస్థ చైర్మన్ రాజీవ్ జైన్ భారతీయుడే. జీక్యూజీ పార్ట్నర్స్కు చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌గానూ ఆయనే ఉన్నారు. అన్ని జీక్యూజీ పార్ట్నర్స్ వ్యూహాల్లో పోర్ట్‌ఫోలియో మేనేజర్ కూడా జైనే. ఈ నేపథ్యంలో అదానీలో పెట్టుబడులు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. కాగా, భారత్‌లో పుట్టి పెరిగిన జైన్.. 1990ల్లో అమెరికాకు వెళ్లారు. అక్కడ రకరకాల సంస్థల్లో పనిచేసి 2016 జూన్‌లో జీక్యూజీ పార్ట్నర్స్ను స్థాపించారు. ఈ కంపెనీకి 800కుపైగా సంస్థ ల్లో 88 బిలియన్ డాలర్లకుపైగా ఆస్తులున్నాయి. 10 దేశాల్లో ఫండ్ మేనేజర్లున్నారు. మరోవైపు హిండెన్‌బర్గ్ రిపోర్టు దెబ్బకు అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 140 బిలియన్ డాలర్లకుపైగా హరించుకుపోయిన విషయం తెలిసిందే.