Adani Vs Hindenburg | అదానీ గ్రూప్ మూడు రోజుల్లో 72 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను కోల్పోయింది. అదానీ గ్రూప్ వ్యాపారం, స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్, రుణ భారంపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ బయటపెట్టిన నివేదిక ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీన పరిచింది. ఫలితంగా అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ మాత్రమే సోమవారం ట్రేడింగ్‌లో పుంజుకున్నది. ఇక హిండెన్‌బర్గ్ నివేదిక నిరాధారం అంటూ గౌతం అదానీ వెలువరించిన 413 పేజీల వివరణ నివేదిక కూడా ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపలేకపోయింది. అదానీ గ్రూప్ కీలక డాలర్ బాండ్లు కూడా తాజా కనిష్ట స్థాయిని తాకాయి.
అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్ 20 శాతం చొప్పున, అదానీ గ్రీన్ ఎనర్జీ 18 శాతం, అదానీ పవర్- అదానీ విల్మార్ ఐదు శాతం చొప్పున నష్టాలతో ముగిశాయి. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ 0.5 శాతం పతనమైంది. అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రారంభ ట్రేడింగ్‌లో 10 శాతం పుంజుకున్నా.. ముగింపు సమయానికి లాభాలు హరించుకుపోయి రెండు శాతం నష్టంతో ముగిసింది.
2.5 బిలియన్ డాలర్ల నిధుల సేకరణ లక్ష్యంతో అదానీ ఎంటర్ ప్రైజెస్ ప్రకటించిన ఫాలోఅప్ ఓపెన్ ఆఫర్ (ఎఫ్‌పీవో)కు ఇన్వెస్టర్ల నుంచి స్పందన కొరవడింది. షేర్ రూ.3112-3276 మధ్య ప్రకటించిన ఎఫ్పీవోకన్నావిలువ కన్నా తక్కువగా అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ రూ.2,892 వద్ద ట్రేడయింది. విదేశీ, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సైతం బిడ్లు దాఖలు చేయడానికి ఉత్సాహం చూపలేదు.