Adani Group | ఇండియన్ బిలియనీర్.. గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ సుమారు రూ.29.07 లక్షల కోట్లు (350 కోట్ల డాలర్ల) రుణం రీ-ఫైనాన్స్ కోసం బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతున్నది. గతేడాది అంబుజా సిమెంట్స్ సంస్థ టేకోవర్ కోసం చేసిన 380 కోట్ల డాలర్ల రుణం చెల్లింపుల కోసం రీఫైనాన్స్ ఫెసిలిటీ కల్పించాలని బ్యాంకర్లను అదానీ గ్రూప్ కోరుతున్నట్లు సమాచారం. ఈ రుణంలో కనీసం 300 మిలియన్ డాలర్ల రుణం అదానీ గ్రూప్ చెల్లించాల్సి ఉందని విశ్వసనీయ వర్గాల భోగట్టా.. రీఫైనాన్స్ కోరే బ్యాంకులను మూడు క్యాటగిరీలుగా విభజించినట్లు తెలిసింది. ఈ రీ ఫైనాన్స్ ఫెసిలిటీకి బ్యాంకులు ఆమోదం తెలిపితే ఆసియాలోనే అతి పెద్ద సిండికేటెడ్ లోన్ డీల్ అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
ఆయా బ్యాంకులతో సంప్రదింపులు పూర్తిగా ప్రైవేట్ అని పేరు చెప్పడానికి ఇష్ట పడని వర్గాలు తెలిపాయి. గల్ఫ్, జపాన్ తదితర దేశాల్లోని బ్యాంకింగ్ సంస్థలను అదానీ గ్రూప్ సంప్రదించింది. వాటిల్లో డీబీఎస్ గ్రూప్ హోల్డింగ్స్, ఫస్ట్ అబుదాబీ బ్యాంక్ పీజేఎస్సీ, మిజుహో ఫైనాన్సియల్ గ్రూప్ ఇంక్, మిత్ సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్సియల్ గ్రూప్, సుమితోమో మిత్సుయి బ్యాంక్ 400 మిలియన్ డాలర్ల చొప్పున అదానీ గ్రూపుకు రీ-ఫైనాన్స్ చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తున్నది. మరి కొన్ని బ్యాంకులు కొద్ది మొత్తాల్లో రుణాలు సర్దుబాటు చేస్తాయని వినికిడి.
ఈ బ్యాంకర్లు, అదానీ గ్రూప్ మధ్య చర్చలు అడ్వాన్స్డ్ దశలోనే ఉన్నా విధి విధానాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని బ్లూంబర్గ్ ఓ వార్తా కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే గత జనవరిలో అదానీ గ్రూప్ సంస్థలపై యూఎస్ షార్ట్ షెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసింది.
అదానీ గ్రూప్ సంస్థల ఆస్తుల కంటే రుణాలే ఎక్కువ అని, ఆ సంస్థలు స్టాక్ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడుతున్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఈ ఆరోపణలను పదేపదే తోసిపుచ్చినా.. అదానీ గ్రూప్ ఇన్వెస్టర్ల విశ్వాసం పొందలేకపోయింది. దీంతో ఒకానొక దశలో 150 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. ఈ తరుణంలో వ్యాపార లావాదేవీలు సాధారణ స్థాయికి తేవడానికే రీ ఫైనాన్సింగ్ ఆప్షన్‌ను అదానీ గ్రూప్ ఎంచుకున్నట్లు తెలియవచ్చింది. దీనిపై స్పందించేందుకు సంబంధిత బ్యాంకులు గానీ, అదానీ గ్రూప్ గానీ ముందుకు రాలేదు.