GST | న్యూఢిల్లీ, జూన్ 22: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి సమావేశం పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చింది. రైల్వే ప్లాట్‌ఫాం టికెట్లకు జీఎస్టీ మినహాయింపునిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది. శనివారం ఇక్కడ జరిగిన 53వ జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే ప్లాట్‌ఫాం టికెట్లతో సామాన్యుడిపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు వీటిపై కౌన్సిల్ జీఎస్టీ మినహాయింపునిచ్చింది.
ప్లాట్‌ఫాం టికెట్‌తోపాటు ఇతర సేవలు, విశ్రాంతి గదులు, వేచివుండే గదులు, క్లాక్‌రూం ఫెసిలిటీ, బ్యాటరీతో నడిచే కార్లపై జీఎస్టీ మినహాయింపునిచ్చినట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. పన్నులను హేతుబద్దీకరించడంలో భాగంగా కౌన్సిల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత తొలి మూడేండ్లలో జారీ అయిన డిమాండ్ నోటీసులపై జరిమానా, వడ్డీలను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో జీఎస్టీ చెల్లింపుదారులకు భారీ ఊరట లభించినైట్టెంది.
అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్లెయింలో జీఎస్టీ నకిలీ ఇన్వాయిస్లకు చెక్ పెట్టే ఉద్దేశంలో భాగంగా దేశవ్యాప్తంగా జరిగే జీఎస్టీ రిజిస్టేషన్లను ఆధార్‌తో అనుసంధానం చేయనున్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఈ ప్రతిపాదనను ఇప్పటికే గుజరాత్, పుదుచ్చేరిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో వేగవంతంగా రిజిస్ట్రేషన్లు కావడంతోపాటు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు సంబంధించి మోసపూరిత ఇన్వాయిస్లకు చెక్పడే అవకాశాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను వచ్చే నెల ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్ తర్వాత మరోసారి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానున్నది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత జరిగిన తొలి జీఎస్టీ సమావేశం ఇదే.

ఎరువులపై జీఎస్టీ మినహాయింపు లేదు..
ఎరువులపై జీఎస్టీ మినహాయింపుపై కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రైతులకు ప్రయోజనం కల్పించే ఉద్దేశంలో భాగంగా స్టాండింగ్ కమిటీ జీఎస్టీని ఎత్తివేయాలని, అలాగే ముడి సరుకులపై విధించే జీఎస్టీని తగ్గించాలని సూచించింది. ప్రస్తుతం ఎరువులపై 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తుండగా, ముడిసరుకులైన సల్ఫ్యూరిక్ యాసిడ్, అమ్మోనియాపై 18 శాతం పన్ను విధిస్తున్నది.