SEBI | ముంబై, సెప్టెంబర్ 5: క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉద్యోగులు నిరసనల బాట పట్టారు. అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొంటున్న సెబీ చీఫ్ మాధబీ పురి బుచ్ రాజీనామాను కోరుతూ ఇక్కడి బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోగల హెడ్ ఆఫీస్ ఎదుట పెద్ద ఎత్తున మౌన ప్రదర్శన ఇచ్చారు. బుచ్తోపాటు ఈ వ్యవహారంలో ఉన్న ఇతర అధికారుల కార్యాలయాల ముందూ నిరసనల్ని వ్యక్తం చేశారు. ఇందులో 200 మందికిపైగా పాల్గొన్నట్టు అంచనా.
వీరిలో ఎవరూ మీడియా ముందు మాట్లాడలేదు. కానీ బుధవారం సెబీ విడుదల చేసి పత్రికా ప్రకటనను ఉపసంహరించుకోవాలని, సెబీ చీఫ్ రాజీనామా చేయాలని నినదించారు. సుమారు గంటన్నరపాటు ఈ నిరసనలు కొనసాగాయి. నిజానికి గతంలోనూ ఇదే తరహాలో సెబీ ప్రధాన కేంద్రం వద్ద ఆందోళనలు జరిగాయి. అయితే వాటికి, ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదని అక్కడి ఉన్నతాధికారులు కొట్టిపారేశారు. ఆ నేపథ్యంలో తాజా ఉద్యోగుల నిరసన మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది.
అదానీ గ్రూప్ వ్యవహారంలో బుచ్ పాత్ర కూడా ఉందని, విదేశాల్లోని కొన్ని సంస్థల్లో ఆమెకు, ఆమె భర్తకు వాటాలున్నాయని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ బయటపెట్టింది. అప్పట్నుంచి బుచ్ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 6న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు సెబీలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, ఉన్నతాధికారుల తీరు అస్సలు బాగాలేదంటూ దాదాపు 500 మంది ఉద్యోగులు లేఖ రాశారు. దీనిపై మీడియాలో వార్తలు రావడంతో సెబీ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ అంతా ఉట్టిదేనంటూ కొట్టిపారేసింది. ఇది ఉద్యోగులకు మరింత ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది.
సహారా గ్రూప్.. ఓ ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో 15 రోజుల్లోగా రూ.1,000 కోట్లను డిపాజిట్ చేయాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. అలాగే రూ.10,000 కోట్ల డిపాజిట్ కోసం ముంబైలోని వార్సోవా వద్దనున్న భూమి అభివృద్ధికి జాయింట్ వెంచర్ ఏర్పాటుకు అనుమతించింది.