అమెరికా ఫెడ్ వడ్డీ రేటును ఏకంగా 0.75 శాతం పెంచడం, యూరప్ కేంద్ర బ్యాంక్‌లు వరుసగా రేట్ల పెంపును ప్రకటించడంతో గతవారం ప్రపంచ మార్కెట్లన్నీ తీవ్ర పతనాన్ని చవిచూశాయి. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా భారత్ సూచీలు సైతం భారీగా క్షీణించాయి. డాలర్ ఇండెక్స్ రికార్డు గరిష్ఠానికి చేరడం, రూపాయి విలువ రికార్డు కనిష్ఠాన్ని చూడటంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) విక్రయాల్ని వేగవంతం చేసారు. ఈ ప్రభావంతో నిఫ్టీ అత్యంత ముఖ్యమైన మద్దతు 15,670 పాయింట్ల స్థాయిని కోల్పోయి, వారంలో 909 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. 15,293 పాయింట్ల వద్ద నిలిచింది. ఈ వారం డెరివేటివ్స్ విభాగంలో ఎఫ్ఐఐల షార్ట్ కవరింగ్, రిటైల్ ఇన్వెస్టర్ల లాంగ్ పొజిషన్ల ఆఫ్‌లోడింగ్ కారణంగా మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
15,400 ట్రెండ్ డిసైడర్
ఈ వారం నిఫ్టీకి 15,400 పాయింట్ల స్థాయి ట్రెండ్ డిసైడర్‌గా ఉంటుందని, ఆపైన స్థిరపడితే 15,600-15,700 శ్రేణి వద్దకు పెరగొచ్చని, ఆ స్థాయి దిగువన 15,200-15,000 శ్రేణికి పడిపోవొచ్చని కొటక్ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ హెడ్ అమోల్ అథేవాలా విశ్లేషించారు. వారంలో 5 శాతంపైగా పతనమైన తర్వాత జూన్ 17న నిఫ్టీ క్షీణించినపుడు డోజి ఏర్పర్చిందని, ఇది అప్‌వర్డ్ రివర్సల్‌కు సంకేతమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గతవారపు 15,183 పాయింట్ల కనిష్ఠస్థాయి కీలకమని, పెరిగితే 15,660 వద్ద నిరోధాన్ని ఎదుర్కొంటుందని అంచనా వేశారు. 14,800-15,000 శ్రేణి వద్ద తదుపరి మద్దతు ఉందని రిల్గేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అంచనా వేసారు.