RS 2K Notes | రూ.2వేలనోట్లపై ఆర్బీఐ సోమవారం కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 97.69శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగివచ్చినట్లు రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. రద్దు చేసిన నోట్లలో కేవలం రూ.8,202 కోట్లు మాత్రమే తిరిగి రావాల్సి ఉందని తెలిపింది. గతేడాది మే 19న ఆర్బీఐ రూ.2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. రూ.3.56లక్షల కోట్ల విలువైన రూ.2వేలనోట్లు చెలామణిలో ఉండేదని ఆ సమయంలో ఆర్బీఐ వెల్లడించింది. గత నెల 29 వరకు రూ.8,202 కోట్లకు తగ్గిందని తెలిపింది. రూ.2వేలనోట్ల చట్టబద్ధంగా చెల్లుబాటవుతుండగా.. దేశవ్యాప్తంగా 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకునేందుకు వీలున్నది.
గతేడాది మే 19న రూ.2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకునేందుకు, డిపాజిట్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఆ తర్వాత నుంచి 19 ఆర్బీఆర్ కార్యాలయాల్లో మాత్రమే మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. అహ్మదాబాద్, బెంగుళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబయి, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో నోట్లను డిపాజిట్ చేసేందుకు, మార్చుకునేందుకు వీలున్నది.