Startups laid off | ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోకుండా ఉండేందుకు పలు బడా కంపెనీలు ఉద్యోగుల తొలగింపు పనులు చేపడుతుండగా.. స్టార్టప్‌లు కూడా వాటి బాటలోనే నడుస్తున్నాయి. మన దేశంలోని 44 స్టార్టప్ సంస్థలు వాటిలో పనిచేసే 16 వేల ఉద్యోగులను ఇంటికి పంపినట్లు తెలుస్తున్నది. వీటిలో సగం స్టార్టప్‌లు ఎడ్టెక్ సంస్థలే కావడం విశేషం. వీటిలో పనిచేస్తున్న దాదాపు 7 వేల ఉద్యోగులకు పని లేకుండా పోయింది. బైజూస్ వంటి యునికార్న్స్ ఈ విషయంలో రెండో స్థానంలో నిలిచింది.
లేఆఫ్స్ ట్రాకింగ్ వెబ్సైట్ ‘లేఆఫ్స్’ ప్రకారం, ఈ ఏడాది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 930 కంపెనీలు 1,46,407 మంది ఉద్యోగులను తొలగించాయి. 2021 లో ఎక్కువ మంది ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేసుకోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తున్నది. మరోవైపు ఐటీ కంపెనీ యాక్సెంచర్ 1,57,000 మంది ఉద్యోగులకు పదోన్నతి కల్పించింది. ఇందులో 60 వేల మందికి పైగా ఉద్యోగులు మన దేశానికి చెందినవారున్నారు.
ఇలా ఉండగా, కొత్త సంవత్సరంలో ఐటీ రంగం 1.5 లక్షల ఉద్యోగాలకు బహుమతులు ఇవ్వనున్నది. 2023 మార్చి చివరి నాటికి, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి భారతీయ ఐటీ కంపెనీలు 1.5 లక్షల మందికి పైగా ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం.