హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సింగరేణి ఉజ్వల భవిష్యత్తు కోసం మరో 9 గనులను ప్రారంభించనుంది. ఈ ఏడాది మూడు, వచ్చే ఏడాది రెండు కొత్త గనులతోపాటు పాత గనుల సామర్థ్యాన్ని భారీగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తొమ్మిది కొత్త ప్రాజ్టెక్ట్లు చేపట్టేందుకు సంస్థ కేంద్ర బొగ్గు, అటవీ, పర్యావరణ శాఖల అనుమతికి ప్రతిపాదనలు సమర్పించింది.
ఇప్పటికే కొత్తగూడెంలో వీకే కోల్‌మైన్ అనుమతులు లభించాయి. ఈ గని మట్టి తొలగింపు పనులు నడుస్తుండగా, త్వరలోనే బొగ్గు వెలికితీతను ప్రారంభించనున్నారు. కొత్త బొగ్గు గనులపై సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి సమీక్షను నిర్వహించారు. కొత్త ప్రాజెక్ట్‌లు అందుబాటులోకి వస్తే 20 ఏండ్ల పాటు బొగ్గు ఉత్పత్తి జరగనుందన్నారు. 2027-28 ఆర్థిక సంవత్సరంలో సింగరేణిలో నాలుగు గనులు మూతపడుతుండగా, దీంతో 12.51 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనున్నది. దీంతో కొత్తగా ప్రారంభించే గనుల ద్వారా ఈ లోటును భర్తీచేసుకునే అవకాశమేర్పడనుంది. గనుల ప్రారంభానికి, అనుమతులు పొందేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.