Infosys | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,17,493.78 కోట్లు హరించుకోపోయింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ భారీగా నష్టపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర సంస్థలు నష్టపోయాయి. ఐటీసీ, ఎస్బీఐ మాత్రమే లాభ పడ్డాయి. గతవారం ట్రేడింగ్లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 775.94 పాయింట్లు (1.28 శాతం) నష్టపోయింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.66,854.05 కోట్లు నష్టపోయి రూ.5,09,215 కోట్ల వద్ద సరిపెట్టుకున్నది. అమెరికా బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం నేపథ్యంలో పలు కార్పొరేట్ సంస్థలు తమ ఐటీ బడ్జెట్లు పొదుపు చేశాయి. దీంతో ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నికర లాభం అంచనాల కంటే తక్కువగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గ్రోత్ గైడెన్స్ బలహీనంగా 4-7 శాతం అని పేర్కొనడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. ఫలితంగా ఇన్ఫోసిస్ అమ్మకాల ఒత్తిడికి గురైంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,880.5 కోట్లు కోల్పోయి రూ.9,33,937.35 కోట్ల వద్ద స్థిర పడింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.10,462.77 కోట్ల నష్టంతో రూ. 6,17,477.46 కోట్ల వద్ద నిలిచింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,318.52 కోట్ల పతనంతో రూ.11,56,863.98 కోట్లతో సరిపెట్టుకున్నది.
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,458.53 కోట్ల నష్టంతో రూ.5,86,927.90 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.5,172.27 కోట్లు పతనమై రూ. 5,06,264.24 కోట్ల వద్ద నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,566.52 కోట్లు కోల్పోయి రూ.15,89,169.49 కోట్ల వద్ద ముగిసింది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.780.62 కోట్ల నష్టంతో రూ.4,26,635.46 కోట్ల వద్ద స్థిర పడింది.
ఇదిలా ఉంటే ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,907.86 కోట్లు పెరిగి రూ.5,07,373.82 కోట్లకు చేరుకున్నది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.8,746.11 కోట్లు వృద్ధి చెంది రూ.4,84,561.80 కోట్ల వద్ద నిలిచింది. గత వారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్, ఇన్పోసిస్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), భారతీ ఎయిర్టెల్ నిలిచాయి.