ముంబై, జూన్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ తొలిసారిగా 77 వేల మార్క్‌ను అధిగమించగా, నిఫ్టీ సైతం మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలకు కిక్కునిచ్చాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 308.37 పాయింట్లు అందుకొని నూతన గరిష్ఠ స్థాయి 77,301.14 వద్ద ముగిసింది. ఇంట్రాలో 374 పాయింట్లు ఎగబాకి లైఫ్‌టైం హై 77,367 తాకి చివర్లో ఈ లాభాలను నిలుపుకోలేకపోయింది.
మరో సూచీ నిఫ్టీ 92.30 పాయింట్లు ఎగబాకి రికార్డు స్థాయి 23,557.90 వద్ద స్థిరపడింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రికార్డు స్థాయి రూ.4,37,24,261.40 కోట్లు(5.24 ట్రిలియన్ డాలర్లకు) చేరుకున్నది. గత నాలుగు సెషన్లలో మదుపరుల సంపద రూ.10.29 లక్షల కోట్ల మేర పెరిగింది. సూచీల్లో పవర్ గ్రిడ్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. కానీ, మారుతి, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, టాటా మోటర్స్, ఐటీసీ, టీసీఎస్‌లు నష్టపోయాయి.