Telangana | హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నూతన పరిశ్రమను ఏర్పాటుకు సంబంధించి మీకు రావాల్సిన సబ్సిడీలు పెండింగులో ఉన్నాయా..! అయితే చింతించాల్సిన అవసరం లేదు. సబ్సిడీ ఎప్పటి నుంచైనా ఉండని.. మీరు అమ్యమ్యాలు ముట్టచెప్పితే సరిపోతుంది.. మీకన్నా ముందు సబ్సిడీ అందుకోవాల్సిన వారు ఎంత మందైనా ఉండని ముందు మీ బ్యాంక్ ఖాతాలో సబ్సిడీలు జమవుతాయి.
అయితే ఇందుకోసం మీరు ఆర్థిక మంత్రిత్వ శాఖలో పలుకుబడి ఉన్న దళారులకు 7 శాతం నుంచి 8 శాతం వరకు ముట్టజెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విషయం పరిశ్రమ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సబ్సిడీ పొందాలంటే కమీషన్ ఇచ్చుకోవాల్సిందేనని వారు అల్టిమేటం జారీ చేస్తున్నారు. లేకపోతే మీ నంబర్ రావడానికి ఎన్ని రోజులైనా వేచి చూడకతప్పని పరిస్థితి.
లంచాలు ఇచ్చుకోలేని చిన్న, చితక సంస్థల యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలే ఆర్థిక కష్టాలతో నత్తనడకన సాగుతున్న వ్యాపారాలకు సబ్సిడీ చెల్లించకపోకపోవడంతో కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి కూడా. అసలే సబ్సిడీ అంతంత మాత్రంగానే ఉండగా..ఆపై కమీషన్ల రూపంలో మరో 8 శాతం వరకు చెల్లిస్తే తమకు మిగిలేది ఏమీ ఉండదని వారు వాపోతున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని వివరాలు..
నగర శివార్లలోని ఓ పారిశ్రామికవేత్తకు రావాల్సిన రూ. 30 లక్షల సబ్సిడీ రెండేండ్లుగా పెండింగ్‌లో ఉంది. ఈ సబ్సిడీ వస్తదని ముందుగానే ఊరంతా అప్పులు చేశారు. చివరకు ఇటు సబ్సిడీ రాలేదు..మరోవైపు అప్పులపై వడ్డీలు భారీగా పెరిగాయి. చివరకు చేసేదేమి లేకపోవడంతో మధ్య దళారీని కలుసుకొని 7 శాతం కమీషన్ ఇస్తానని మాట్లాడుకున్నారు. ఒప్పందం ప్రకారం సదరు దళారీకి ముందే చెక్కులు ఇచ్చాడు. పక్షం రోజుల్లో తనకు రావాల్సిన సబ్సిడీ తన ఖాతాలో జమైంది. ఆ వెంటనే దళారీకి నగదు ఇచ్చి తన చెక్కులు వాపస్ తీసుకున్నాడు.
నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ పారిశ్రామికవాడలో యూనిట్ ఏర్పాటుచేసుకున్న మరో పారిశ్రామికవేత్తకు రూ. 20 లక్షల సబ్సిడీ మూడేండ్లుగా పెండింగ్‌లో ఉంది. సదరు వ్యాపారవేత్త దళారితో మాట్లాడుకొని 8 శాతం కమీషన్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ. 50 వేలు సమర్పించుకున్నాడు. పది రోజుల్లో సబ్సిడీ విడుదలైంది. అనంతరం మిగిలిన మొత్తాన్ని కూడా ఇచ్చాడు.
ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే. ‘నాకు తెలిసిన ఐదుగురు పారిశ్రామికవేత్తలకు గత మూడు-నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సబ్సిడీ ఇటీవలే విడుదలయ్యాయి. దళారీలతో ఎంతో సులభంగా, వేగవంతంగా సబ్సిడీలు అందుకోవచ్చును. రావాల్సిన సబ్సిడీ అధికంగా ఉంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని’ అని ఓ పారిశ్రామికవేత్త పేర్కొన్నాడు. టీఎస్ ఐపాస్ చట్టంలో భాగంగా టీ-ఐడియా, టీ-ప్రైడ్ స్కీమ్‌లకు సంబంధించి కొంతకాలంగా సుమారు రూ. 3,500 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.
బకాయిలన్నీ విడుదల చేస్తామని సీఎం సహా మంత్రులు వివిధ సందర్భాల్లో ప్రకటించినప్పటికీ అది సాకారం కాలేదు. ఈ నేపథ్యంలో దొంగచాటుగా సబ్సిడీ బకాయిలు విడుదల చేసుకోవచ్చునని పరిశ్రమ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఆర్థిక శాఖకు చెందిన ప్రముఖులతో సంబంధాలున్న కొందరు దళారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇందులో ఆరోపణలకు తావులేకుండా ఉండేందుకు తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్ లిమిటెడ్(టీఐహెచ్‌సీఎల్)ను పావుగా వాడుకుంటున్నట్లు సమాచారం.
నష్టాల్లో కూరుకుపోయిన యూనిట్లను అధ్యయనం చేసి వాటిని కొనసాగించే విధంగా తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు టీఐహెచ్‌సీఎల్‌ను గతంలో ఏర్పాటు చేశారు. కాగా, సబ్సిడీ బకాయిలు విడుదల చేసేందుకుగాను ముందుగా టీఐహెచ్‌సీఎల్ నుంచి నష్టాల్లో ఉన్నట్లు ధృవపత్రం పొంది, దాని ఆధారం చేసుకొని సబ్సిడీలు విడుదల చేస్తున్నట్లు తెలిసింది. సహజంగా రాయితీలు సీనియారిటీ ఆధారంగా విడుదల చేస్తారు. దీని ప్రకారం ముందుగా పరిశ్రమ పెట్టుకున్నవారికి ముందుగా సబ్సిడీ విడుదల చేయాల్సి ఉంటుంది.
అయితే, ఈ దళారుల దందాలో సీనియారిటీతో పనిలేకుండానే సబ్సిడీలు విడుదలవుతుండటం విశేషం. ఎంతోమంది మూడు-నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్నవారిని కాదని, ఇటీవలే పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నవారికి కూడా సబ్సిడీలు అందుతుండటం విశేషం. బకాయిల వివరాలను ఇదివరకే పరిశ్రమల శాఖ ప్రభుత్వానికి పంపింది. పరిశ్రమల శాఖలోని కొందరు అధికారులు కూడా దళారులతో కుమ్మక్కై సబ్సిడీల విడుదలలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చింది. టీ-ఐడియా కింద జనరల్ కేటగిరికి, టీ-ప్రైడ్ కింద ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు గత ప్రభుత్వం ప్రకటించింది. టీ-ఐడియా కింద భూమిని కొనుగోలు చేసినవారికి 100 శాతం స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్‌తోపాటు భూమి విలువలో 25 శాతం(గరిష్ఠంగా రూ.10 లక్షలు) రాయితీ, సొంత భూమిలో యూనిట్ పెట్టుకునేవారికి కన్వర్షన్ చార్జీల్లో 25 శాతం(గరిష్ఠంగా రూ.10 లక్షలు) రాయితీ ఇచ్చేవారు. దీంతోపాటు ఐదేండ్లపాటు రూపాయికే విద్యుత్ సరఫరా, దీనికి సంబంధించి చెల్లింపులు జరిపిన వారికి రీయింబర్స్మెంట్ కింద 15 శాతం పెట్టుబడి రాయితీ(గరిష్ఠంగా రూ.20 లక్షలు), ఐదేండ్లపాటు వ్యాట్, ఎస్జీఎస్టీ మాఫీ చేయనున్నారు. అలాగే ఐదేండ్లపాటు పావలావడ్డీ పథకం కింద చెల్లించిన వారికి రీయింబర్స్మెంట్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రవేశపెట్టిన టీ-ప్రైడ్ కింద కూడా పెట్టుబడి రాయితీ 35 శాతం (గరిష్ఠంగా రూ.75లక్షలు) రాయితీ ఉంది. దీంతోపాటు మహిళలకు మరో ఐదు శాతం అదనంగా రాయితీలు లభించనున్నాయి.