T-Hub | హైదరాబాద్ సిటీబ్యూరో(నమస్తే తెలంగాణ), జూలై 20: టీ-హబ్ ఇంక్యూబేటర్ సైట్స్60 (www.sites60.com).. చిన్న వ్యాపారులకోసం కేవలం 60 సెకండ్లలోనే తమ వెబ్‌సైట్‌ను రూపకల్పన చేసే టెక్నాలజీని పరిచయం చేసింది. ఈ సరికొత్త టెక్నాలజీని రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ గురువారం ఆవిష్కరించారు. చాట్ జీపీజీ, ఏఐ సేవలు, వెబ్‌సైట్‌కు అవసరమైన సమగ్రమైన సమాచారంతో సులభంగా వెబ్‌సైట్‌ను రూపొందించవచ్చునని సైట్స్60 ఫౌండర్ రాజీవ్ రావులపాటి తెలిపారు. ఎంఎస్ఎంఈలకు డిజిటల్ సేవలను విస్తరించడంలో ఈ నూతన టెక్నాలజీ సమర్థవంతంగా పనిచేస్తున్నదన్నారు. ఇప్పటికే సొంత డొమైన్ ఉన్నవారు ఏడాదికి రూ.5 వేలతో లోగోతోపాటు ఇతర వివరాలు, సీఆర్ఎం, సంబంధిత సేవలపై సమగ్ర సమాచారంతో కూడిన వెబ్‌సైట్‌ను రూపొందించి ఇస్తామన్నారు.
2025 నాటికి దేశవ్యాప్తంగా 10 లక్షల ఎస్ఎంఈలకు సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల ఎస్ఎంఈలు ఉండగా, వీటిలో 29 శాతం సంస్థలకు వెబ్సైట్లు లేవు. ఈ కార్యక్రమంలో టీహబ్ సీఓఓ అనీష్ ఆంథోనీ, యాప్స్పేస్ ఇన్నోవేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. చిన్న వ్యాపారవేత్తలకు అనేక సమస్యలుంటాయి. ఏ సమాచారం ఎక్కడ దొరుకుతుందో తెలియలదు..ఒకవేళ తెలిసినా, దాన్నంతటినీ తమ సొంత వెబ్సైట్ రూపంలోకి మార్చుకోవాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఇలాంటి వారందరి అవసరాల కోసం సైట్స్ సైట్స్ 60.కామ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.