న్యూఢిల్లీ, జూన్ 24 : గత ఏడాది చివరి నాటికి దేశంలో 5జీ వినియోగదారులు 29 కోట్లకు చేరారని మంగళవారం విడుదలైన ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్టులో తేలింది. మొత్తం భారతీయ మొబైల్ వినియోగదారుల్లో ఇది 24 శాతమని పేర్కొన్నది. అలాగే ఒక్కో స్మార్ట్ఫోన్ యూజర్ నెలకు 32 జీబీ డాటాను వాడుకున్నారని ఈ తాజా నివేదికలో ఎరిక్సన్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే 2030కల్లా ఇంచుమించుగా మూడురెట్లు పెరిగి దేశీయ 5జీ సబ్స్ర్కైబర్లు దాదాపు 98 కోట్లకు చేరుకోవచ్చని (దేశీయ మొబైల్ వాడకందారుల్లో 75 శాతం), నెలకు స్మార్ట్ఫోన్ వినియోగదారుల డాటా వాడకం 62 జీబీని తాకవచ్చని అంచనా వేసింది.
ఇక 2030 నాటికి దేశంలో 4జీ కస్టమర్లు ప్రస్తుతంతో పోల్చితే సుమారు 60 శాతం పడిపోయి 23 కోట్లకు పరిమితం కావచ్చంటూ ఈ అప్డేటెడ్ రిపోర్టులో స్వీడిష్ టెలికం కంపెనీ చెప్పింది. నిరుడు నవంబర్లో విడుదల చేసిన రిపోర్టులో 2030 నాటికి దేశంలో 5జీ యూజర్లు 97 కోట్లకు పెరగవచ్చని, 4జీ కస్టమర్లు 24 కోట్లుగా ఉంటారని అంచనా వేసింది. నెలవారీ డాటా వినియోగం కూడా స్మార్ట్ఫోన్కు 66 జీబీగా ఉండొచ్చన్నది. అయితే తాజా నివేదికలో ఈ నెంబర్లను సవరించింది.