Automobiles | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ప్రస్తుత పండుగ సీజన్లో కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఆటోమొబైల్ సంస్థలు సరికొత్త మాడళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. ఇప్పటికే ప్రతి నెలలో అర డజన్‌కు పైగా మాడళ్లను విడుదల చేస్తున్న సంస్థలు..వచ్చే నెలలోనూ ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఐదు మాడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. వీటిలో కియా, నిస్సాన్, బీవైడీ, మెర్సిడెజ్ బెంజ్‌లు ఉన్నాయి. ఈ వివరాలు..
కొరియాకు చెందిన వాహన సంస్థ కియా.. దేశీయ మార్కెట్లోకి నయా కార్నివాల్‌ను విడుదల చేయబోతున్నది. వచ్చే నెల 3న మార్కెట్లోకి విడుదల చేస్తున్న ఈ కారు ధర రూ.50 లక్షల స్థాయిలో ఉంటుందని అంచనా. 2.2 లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్‌తో తయారైన ఈ కారు 193 బీహెచ్‌పీల శక్తినివ్వనున్నది. దీంతోపాటు మరో ఈవీ మాడల్‌ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నది. 99.8 కిలోవాట్ల బ్యాటరీతో తయారు చేసిన ఈవీ 9లో ఆరుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసింది. సింగిల్ చార్జింగ్‌తో 561 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. కేవలం 24 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు చార్జింగ్కానున్నది.
వచ్చే నెల 4న మ్యాగ్నైట్ ఫెసిలిఫ్ట్ మాడల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది నిస్సాన్ ఇండియా. దేశీయ మార్కెట్‌తోపాటు ఇతర దేశాలకు అనుగుణంగా లెఫ్ట్-హ్యాండ్ డ్రైవ్ వెర్షన్ కూడా తీసుకురాబోతున్నది.
చైనాకు చెందిన ఈవీల తయారీ సంస్థ బీవైడీ మరో మాడల్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నది. వచ్చే నెల 8న ఈమ్యాక్స్ 7 మాడల్‌ను అందుబాటులోకి తెస్తున్నది. అడాస్ సూట్, ప్రీమియం స్విచ్‌గేర్, సాఫ్ట్-టచ్ మెటిరీయల్స్, లగ్జరీ లుక్‌తో తీర్చిదిద్దింది. రెండు రకాల్లో లభించనున్న ఈ కారులో 55.4 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ 420 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుండగా, 71.8 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ 530 కిలోమీటర్లు ఇవ్వనున్నది.
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఈ-క్లాస్ ఎల్‌డబ్ల్యూబీ మాడల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. 14.4 ఇంచుల సెంట్రల్ టచ్‌స్క్రీన్‌తోపాటు 12.3 ఇంచుల ప్యాసింజర్ టచ్‌స్క్రీన్, 4డీ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ కలిగిన ఈ మాడల్‌ను 2.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో తయారు చేసింది.