న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశీయ ఐటీ దిగ్గజాలు ఒకవైపు వేలాది మంది సిబ్బందిని తొలగిస్తున్న ప్రస్తుత తరుణంలో క్యాప్‌జెమినీ భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుత సంవత్సరంలో 45 వేల మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు, కృత్రిమ మేధస్సుపై ప్రత్యేక దృష్టి సారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ సీఈవో అశ్విన్ యార్ది తెలిపారు. ప్రస్తుతం సంస్థకు భారత్‌లో 1.75 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి క్లయింట్లు అధిక ప్రాధాన్యతనివ్వడంతోపాటు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది దేశీయంగా 50 కళాశాల నుంచి వీరిని తీసుకోనున్నట్టు ఆయన ప్రకటించారు.
టాటా ఇన్స్టిట్యూట్తో ఏజిలెంట్ జట్టు
హైదరాబాద్, ఆగస్టు 2: టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్(టీఐఎఫ్ఆర్)తో వ్యూహాత్మక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఏజిలెంట్ టెక్నాలజీ సంస్థ ప్రకటించింది. న్యూట్రిషన్, మెటబాలిజం పరిశోధన విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు కంపెనీకి చెందిన వర్గాలు వెల్లడించాయి.