బీజింగ్: చైనాలో నావోహున్ అనే సాంప్రదాయం ఉన్నది. అంటే పెళ్లి సంబరాల వేళ.. వధూవరులను డిస్టర్బ్ చేయడం. ర్యాంగింగ్ లాంటిదని చెప్పొచ్చు. వధువైనా, వరుడైనా… వారి బంధుమిత్రులు ఎవరైనా.. పెళ్లి వేడుకలో చాలా హంగామా సృష్టిస్తారు. ముచ్చటగా తయారైన వధూవరులను వేధించడం ఈ ఆచారంలో భాగమే. కానీ ఇటీవల ఈ వేడుకలు శ్రుతిమించుతున్నాయి. కొన్ని సంబరాలు తీవ్ర నష్టాన్ని కూడా మిగుల్చుతున్నాయి. దీంతో నవోహున్ సాంప్రదాయాన్ని రద్దు చేయాలని ఇప్పటికే చైనాలోని కొన్ని రాష్ట్రాలు నిర్ణయించాయి. కొన్ని జిల్లాల్లో నిషేధాలు అమలు చేస్తున్నాయి.
పెళ్లిని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో సరదాగా ఈ ఆట సాగుతుంది. వరుడి దుస్తులు విప్పడమో లేక అతన్ని ఎత్తిపడేయడమో.. లేక అతని శరీరానికి బాంబులు పెట్టి పేల్చడం లాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటారు. వినడానికి బాగానే ఉన్నా.. పెళ్లి చేసుకోబోతున్న కొత్త జంటలకు ఈ సాంప్రదాయం ఓ టెన్షన్ పుట్టిస్తోంది. నావోహున్ పేరుతో ఇంటికి వచ్చిన అతిథులు నానా టెన్షన్ పుట్టిస్తున్నారు. ఇక వధువుల విషయంలో ఆ ఆట కాస్త మరింత విషాదాలను మిగులుస్తోంది. పెళ్లి కూతుర్ని ఆటపట్టించే పేరుతో .. వారిని వేధిస్తున్నారని, కిస్సులు ఇవ్వడం జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. నవ్వులాటగా మొదలయ్యే ఈ క్రీడ.. చివరగా మనోవేదనకు దారితీస్తోంది.
ఇటీవల కొన్ని హృదయవిదారకర సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. వెడ్డింగ్ వేళ వరుడిని వేధించాలనుకున్న మిత్రులు అతన్ని తలకిందులుగా ఎత్తిపడేశారు. దీంతో అతనికి తలకు తీవ్రగాయమైంది. ఒకరికి బాంబులు పెట్టి మరీ పేల్చేశారు. దాంతో ఆ వరుడు లబోదిబోమంటూ మొత్తుకున్నాడు. ఇలా వేధింపు ఘటనలు ఎక్కువడడంతో.. ఆ పురాతన సాంప్రదాయానికి బ్రేక్ వేయాలనుకున్నారు.
నవోహున్కు చరిత్ర ఎక్కువే ఉంది. హన్ సామ్రాజ్యం(202 బీసీ.. 220 ఏడీ)లో ఈ వింత ఆచారం ఉండేదట. దీన్ని అప్పట్లో నావో డాంగ్ఫాంగ్ అనేవారు. అంటే పెళ్లి వేళ కొత్త జంటను టీజ్ చేయడమన్నమాట. కానీ ఆ రోజుల్లో వాళ్లు కొత్త జంటను అవమానపిరచేవారు కాదు. వధూవరులతో ఆడుకునేందుకు అతిథులకు కొన్ని క్రీడలుండేవి. కొత్త కోడల్ని ఎత్తుకుని మామ నడుచుకుంటూ వెళ్లే సాంప్రదాయం కూడా అక్కడ ఉండేదట. నిజానికి ఇద్దరి కుటుంబాల్లో తొందరగా పరిచయాలు ఏర్పడాలన్న ఉద్దేశంతో ఆ ఆటలు ఆడేవారు. ఎందుకంటే పురాతన కాలంలో.. పెళ్లి కాకముందు చైనాలో ఎక్కువగా శాతం ఒకరికి ఒకరు తెలిసేవారు కాదట. టీనేజ్ పెండ్లిల్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఉద్దేశం కూడా ఉండేది.
నవోహున్ పేరుతో పెళ్లి కూతుర్ని, పెళ్లి కుమారుడిని ఏడ్పించిన ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. వాటికి సంబంధించిన వీడియోలు కూడా ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆ నాటి సాంప్రదాయం పట్ల చాలా మందిలో అసహ్యం ఏర్పడింది. చైనాలోని గాంగ్జూ, వూహో, చెంగ్డూ, కింగ్షాన్ ప్రాంతాలతో పాటు మంగోలియాలో కూడా ఈ సాంప్రదాయంపై నిషేధం విధించారు.