Adani Group | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: మొన్న స్టాక్ మార్కెట్ అక్రమాలు.. నిన్న నకిలీ సంస్థల బాగోతాలు.. నేడు మనీ లాండరింగ్ అనుమానాలు.. అదానీ గ్రూప్‌పై వస్తున్న వరుస ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. దేశ, విదేశాల్లో వెలుగుచూస్తున్న అవినీతి కేసుల్లో అదానీ ఆనవాళ్లు కనిపిస్తుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది. తాజాగా స్విట్జర్లాండ్‌లో మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా వివిధ స్విస్ బ్యాంక్ ఖాతాల్లోని ఓ తైవాన్ వ్యక్తికి చెందిన 311 మిలియన్ డాలర్ల (రూ.2,610 కోట్లు)ను అక్కడి అధికారులు ఫ్రీజ్ చేశారు. అయితే ఈ వ్యక్తి అదానీ గ్రూప్ బినామీయేనన్న అనుమానాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. మరోవైపు అదానీ గ్రూప్ వీటిని తీవ్రంగా ఖండించింది. ఏ స్విస్ కోర్టు విచారణల్లోగానీ లేదా జప్తు చేసిన ఖాతాలతోగానీ తమకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేసింది.
ఇదీ సంగతి..
అమెరికా షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ తమ ‘ఎక్స్’ ఖాతాపై స్విట్జర్లాండ్ మీడియా సంస్థ ‘గోతమ్ సిటీ’ కొత్తగా విడుదల చేసిన స్విస్ క్రిమినల్ రికార్డులను పోస్ట్ చేసింది. వీటిలో స్విస్ అధికారులు అదానీకి సంబంధించిన మనీ లాండరింగ్, సెక్యూరిటీస్ ఫోర్జరీ కేసు దర్యాప్తులో భాగంగా కొన్ని స్విస్ బ్యాంక్ ఖాతాల్లో 310 మిలియన్ డాలర్లకుపైగా నిధులను స్తంభింపజేశారని ఉన్నట్టు హిండెన్‌బర్గ్ పేర్కొన్నది. ఈ సొమ్ముకు బాధ్యుడైన తైవాన్ వాసి చాంగ్ చుంగ్-లింగ్.. అదానీ కంపెనీలకు చెందిన నకిలీ సంస్థలు బీవీఐ/మారిషస్ అండ్ బెర్ముడా ఫండ్స్‌ల్లో ఎలా పెట్టుబడులు పెట్టారో అక్కడి విచారణాధికారులు స్పష్టం చేసినట్టు కూడా హిండెన్‌బర్గ్ తమ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నది. కాబట్టి ఈ మనీ లాండరింగ్ కేసుతో అదానీకి సంబంధం ఉందని, సదరు తైవాన్ వ్యక్తి అదానీ బినామీయేనన్న అనుమానాలను వ్యక్తం చేసింది.
స్విస్ మీడియా రిపోర్టుల్లో..
‘జెనీవా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఈ అక్రమాలపై దర్యాప్తు చేసింది. గత మూడేండ్లకుపైగా ఐదు స్విస్ బ్యాంకుల్లో బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందినవాడిగా భావిస్తున్న వ్యక్తికున్న 310 మిలియన్ డాలర్లకుపైగా సొమ్మును అధికారులు ఫ్రీజ్ చేశారని ఫెడరల్ క్రిమినల్ కోర్టు వెల్లడించింది’ అంటూ స్విస్ మీడియా గోతమ్ సిటీ తమ రిపోర్టుల్లో తెలియజేసింది. అంతేగాక తమ దర్యాప్తులో చాంగ్ చుంగ్-లింగ్ అసలు కంపెనీల యజమాని కాదని తేలిందని స్విస్ అధికారులు పేర్కొన్నట్టు వివరించింది. మొత్తంగా ఈ ఏడాది ఆగస్టు 9న ఇచ్చిన ఆదేశాల్లో అదానీ గ్రూప్.. మనీ లాండరింగ్ ఇతరత్రా అక్రమ కార్యకలాపాల్లో భాగమైనట్టు కోర్టు అనుమానాలు వ్యక్తం చేసిందంటూ ఈ నెల 10న విడుదల చేసిన రిపోర్టులో గోతమ్ సిటీ తేల్చిచెప్పింది. అంతేగాక అదానీ గ్రూప్ ద్వారా పెద్ద మొత్తంలో పొందిన సొమ్మును చుంగ్-లింగ్ అక్రమ మార్గాల్లో పెట్టుబడులు పెట్టారన్నది.
అదానీ వాదన ఇదీ..
ఈ వ్యవహారం విచారణ సందర్భంగా స్విస్ కోర్టు తమ కంపెనీ పేరును ప్రస్తావించలేదని, తమ నుంచి ఏ రకమైన వివరణనూ కోరలేదని అదానీ గ్రూప్ అంటున్నది. విదేశాల్లో ఉన్న తమ కంపెనీలన్నీ పారదర్శకంగా ఏర్పాటైనవేనని, అక్కడి చట్టాలు, నిబంధనలకు లోబడే పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చింది. ‘ఈ ఆరోపణలన్నీ అసంబద్ధమైనవి, అహేతుకమైనవి. ఇదంతా మా గ్రూప్ ప్రతిష్ఠను, మార్కెట్ వాల్యూను దెబ్బతీయడానికి చేస్తున్న మరో కుట్రని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు’ అని అదానీ గ్రూప్ ఈ వ్యవహారంపై స్పందించింది. మరోవైపు హిండెన్‌బర్గ్-అదానీ వ్యవహారం రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతున్నది. దీనిపై సుప్రీం కోర్టు లోతుగా విచారణ చేయాలని కాంగ్రెస్‌సహా ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తానికి గతంలో సెబీ విచారణ చేసి ఏమీ తేల్చకపోవడం, దానీ చీఫ్ మాధవీ పురీ బచ్‌పైనా అవినీతి ఆరోపణలు వస్తుండటం, ప్రధాని మోదీకి అదానీకి సంబంధాలు సైతం వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో ఈ అంశం మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది.
చాలా పెద్ద కథే..
గత ఏడాది జనవరిలో అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ అక్రమాలపై హిండెబర్గ్ రిసెర్చ్ విడుదల చేసిన సంచలన రిపోర్టులోనే చాంగ్ చుంగ్-లింగ్ పేరుండటం గమనార్హం. అక్రమ నిధులతో మారిషస్‌లో ఏర్పాటైన గ్రోమోర్ అనే సంస్థకు ఇతను డైరెక్టర్‌గా ఉన్నాడని, విదేశీ ఫండ్స్ ద్వారా అదానీ స్టాక్స్ క్రయవిక్రయాల లావాదేవీలను జరుపుతాడని హిండెన్‌బర్గ్ చెప్తున్నది. అదానీ పవర్‌తో జరిగిన స్టాక్ విలీనం ద్వారా రాత్రికిరాత్రే గ్రోమోర్‌కు 423 మిలియన్ డాలర్ల ప్రయోజనం ఒనగూరినట్టు కూడా గతంలోనే హిండెన్‌బర్గ్ బహీర్గతం చేసింది. ఇక చుంగ్-లింగ్ కుమారుడు చాంగ్ చీన్-టింగ్.. పీఎంసీ ప్రాజెక్ట్స్ (ఇండియా) యజమానుల్లో ఒకరన్నది. భారతీయ క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. అదానీ గ్లోబల్, గ్రోమోర్తోపాటు ఈ పీఎంసీ ప్రాజెక్ట్స్‌పైనా విచారణ చేయడం గమనార్హం. నాటి హిండెన్‌బర్గ్ రిపోర్టు దెబ్బకు అదానీ గ్రూప్‌లోని సంస్థల మార్కెట్ విలువ ఏకంగా 150 బిలియన్ డాలర్లు కుప్పకూలిన సంగతి విదితమే.