Lay-offs | భారత ఐటీ కంపెనీలు ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో ఫెయిలైన 2500 మంది ఫ్రెషర్స్‌కు ఉద్వాసన పలుకవచ్చునని తెలుస్తున్నది. తమ క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా పని చేస్తున్నారా.. లేదా.. అన్న అంశంపై కొత్తగా నియమించుకున్న ఫ్రెషర్స్‌కు ఏడాదిలోపు ప్రతి ఐటీ కంపెనీ ఇంటర్నల్ అసెస్మెంట్ లేదా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఫలితాలను బట్టి లే-ఆఫ్స్ ఆధార పడి ఉంటాయి. కొవిడ్-19 మహమ్మారి వేళ అత్యధిక నియామకాలు చేపట్టడం కూడా ప్రస్తుత ఉద్వాసనలకు కారణమని నిపుణులు చెబుతన్నారు.
`ప్రతి ఐటీ కంపెనీ తాను నియమించుకున్న ఫ్రెషర్స్‌కు శిక్షణ ఇస్తుంది. సరైన పెర్ఫార్మెన్స్ చూపడంలో ఫెయిల్ అయిన వారు 2,500 మందికి పైగా ఉద్వాసనకు గురవుతారు` అని టాలెంట్ సొల్యూసన్స్ ప్రొవైడర్ సంస్థ కెరీర్‌నెట్ కో-ఫౌండర్, సీఈవో అన్షుమన్ దాస్ తెలిపారు. ప్రతియేటా నియమించుకున్న ఫ్రెషర్స్‌లో సుమారు ఒక శాతం మంది స్క్రీనింగ్ టెస్ట్‌ల్లో ఫెయిల్ అవుతారన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల మందిలో సుమారు రెండు శాతం మంది ఫెయిల్ కావచ్చునని చెప్పారు.
అప్పటికే అవసరాన్ని మించిన సిబ్బంది ఉంటే.. క్యాంపస్ సెలక్షన్లలో ఎంపికైన ఫ్రెషర్స్‌కు ఐటీ సంస్థలు కఠినమైన స్క్రీనింగ్ టెస్ట్‌లు పెడుతుంటాయి. క్యాంపస్ నియమకాల్లో ఎంపికైన వారి ప్రతిభాపాటవాలను ప్రశ్నిస్తారు. `అన్ని సెక్టార్ల క్లయింట్ల నుంచి డిజిటల్ సేవలకు గిరాకీ పెరిగినప్పుడు మార్కెట్లో ప్రధాన ఐటీ కంపెనీలను అదనపు డిమాండ్ వెంటాడుతుంటుంది. ప్రతిభావంతుల కోసం తలెత్తే పోటీలో ఆయా కంపెనీలు దూకుడుగా నియామకాలు చేపడతాయి. ఇటువంటి నియామకాలపై సరైన సమయంలో సర్దుబాట్లు తప్పవు` అని కన్సల్టింగ్ సంస్థ ఎవరెస్ట్ గ్రూప్ పార్టనర్ చిరాజిత్ సేన్‌గుప్తా పేర్కొన్నారు.
ఇటీవలే ఇంటర్నల్ స్క్రీనింగ్ టెస్ట్ ఫెయిలైన 600 మంది, విప్రో 452 మంది ఫ్రెషర్స్‌ను ఉద్యోగం మానేయాలని చెప్పినట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం ముప్పు ప్రభావంతో పొదుపు చర్యల పేరిట ఐటీ సంస్థలు జరిపే ఉద్వాసనల ప్రభావం జూనియర్లపైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.