న్యూఢిల్లీ, నవంబర్ 5: జీఎస్టీ ఎగవేతలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎగవేతలు మాత్రం ఆగడం లేదు. జీఎస్టీ కింద 18 వేల బోగస్ సంస్థలను గుర్తించినట్లు, వీటిద్వారా రూ.25 వేల కోట్ల పన్ను ఎగవేతలు జరిగాయని జీఎస్టీ ఉన్నతాధికారులు తెలిపారు. మోస పూరిత కంపెనీలకు వ్యతిరేకంగా జీఎస్టీ అధికారులు చేపట్టిన దాడుల్లో 73 వేల కంపెనీలు వివరాలు సేకరించారని, వీటిలో 18 వేల సంస్థలు బోగస్‌వని గుర్తించినట్లు, ఈ సంస్థలు ఎలాంటి వస్తువులకు సంబంధించి ఇన్వాయిస్ లేకుండా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను ఎగ్గొట్టినట్లు గుర్తించినట్లు చెప్పారు. వీటి విలువ రూ.24,500 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఈ ప్రత్యేక కార్యక్రమంలో పలు సంస్థలు స్వచ్ఛందంగా రూ.70 కోట్ల మేర జీఎస్టీ చెల్లింపులు జరిపినట్లు ఆయన చెప్పారు. మోసపూరిత జీఎస్టీ రిజిస్ట్రేషన్లకు వ్యతిరేకంగా కేంద్ర సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆగస్టు 16 నుంచి అక్టోబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. తొలి విడుత నిర్వహించిన డ్రైవ్‌లో 21,791 సంస్థలు మోసపూరితవిగా గుర్తించారు.
ఇక నిశ్చింతగా విదేశాలకు నగదు బదిలీ ; రియల్-టైమ్ ట్రాకింగ్ సర్వీస్‌ను తెచ్చిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్
న్యూఢిల్లీ, నవంబర్ 5: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్.. విదేశాలకు నగదు బదిలీ ప్రక్రియను మరింత విశ్వసనీయంగా, పారదర్శకంగా చేసింది. రియల్-టైమ్ ట్రాకింగ్ సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఈ తరహా సేవలను ప్రారంభించిన తొలి భారతీయ బ్యాంక్‌గా నిలిచింది. స్విఫ్ట్ గ్లోబల్ పేమెంట్స్ ఇన్నోవేషన్ (జీపీఐ) వేదిక సహకారంతో ఈ కొత్త సౌకర్యం పనిచేయనున్నది. ఇకపై ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మొబైల్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వేదికల ద్వారా కస్టమర్లు తమ విదేశీ చెల్లింపులను ట్రాక్ చేసుకోవచ్చని, పంపిన మొత్తాలు సదరు విదేశీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయో, లేదో సులభంగా తెలుసుకోవచ్చని ఓ ప్రకటనలో బ్యాంక్ వెల్లడించింది. ప్రస్తుతం దేశీయంగా జరుగుతున్న డిజిటల్ లావాదేవీలకే రియల్-టైమ్ స్టేటస్ అప్డేట్స్ అందుకునే వీలున్నది. యూపీఐ లేదా ఐఎంపీఎస్ ద్వారా చేసిన చెల్లింపులను యూజర్లు ట్రాక్ చేసుకోవచ్చు.