Poultry India | మాదాపూర్, నవంబర్ 27: దేశ ఆహార భద్రత, గ్రామీణ ఉపాధికి కీలకంగా ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నదని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ అన్నారు. హైదరాబాద్లోని మాదాపూర్లోగల హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ 16వ ఎడిషన్ను ఐపీఈఎంఏతో కలిసి నిర్వహిస్తున్నారు. మూడు రోజుల ఈ ఎగ్జిబిషన్ బుధవారం మొదలైంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉదయ్ సింగ్ మాట్లాడుతూ.. ఏటా దేశ జీడీపీకి రూ.1.35 లక్షల కోట్ల సహకారాన్ని పౌల్ట్రీ ఇండస్ట్రీ అందిస్తున్నదన్నారు.
లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్నీ కల్పిస్తున్నదని, అలాంటి ఈ పరిశ్రమ.. ముడిసరుకు వ్యయాలు పెరగడం వల్ల కుదేలవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కజొన్న, సోయా వంటి దాణా ఉత్పత్తులతోపాటు పౌల్ట్రీ ఇండస్ట్రీ పరికరాలపై జీఎస్టీ భారం పెరిగిపోయిందని, దీన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. రుణ లభ్యతనూ పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే వ్యాక్సిన్ దిగుమతులకు సత్వర అనుమతులివ్వాలన్న ఆయన.. పిల్లల్లో పోషకాహార లోపం సమస్యను అధిగమించడానికి దేశవ్యాప్తంగా పాఠశాలల భోజన కార్యక్రమాలలో గుడ్డును చేర్చాలనీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారందాకా కొనసాగనున్న ఈ ఎక్స్పోకు 40 వేలకుపైగా సందర్శకులు వస్తారని నిర్వాహకుల అంచనా.