Tech Layoffs : 2024లోనూ టెక్ లేఆఫ్స్ కొనసాగుతుండటంతో పలు కంపెనీలు ఉద్యోగులను సాగనంపుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఏకంగా 1,30,000 మందికిపైగా ఐటీ ఉద్యోగులు కొలువులు కోల్పోయారు. జాబ్ కట్స్ ట్రెండ్ తగ్గుముఖం పట్టకపోవడంతో ఎప్పుడు తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందోనని టెకీల్లో గుబులు రేగుతోంది.
ఐటీ పరిశ్రమ ఆర్ధిక సవాళ్లు కొనసాగడం, మార్జిన్ల ఒత్తిళ్లు, వ్యయ నియంత్రణ చర్యలతో టెక్ కంపెనీలు ఎడాపెడా కొలువుల కోతకు తెగబడుతున్నాయి. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ 397 కంపెనీలు 1,30,482 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయని లేఆఫ్స్.ఎఫ్‌వైఐ డేటా వెల్లడించింది. మరోవైపు సిస్కో మరో దశ లేఆఫ్స్‌కు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.
సిస్కో ఈ ఏడాది ఆరంభంలో 4000 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా మరో దశ లేఆఫ్స్‌కు సిద్ధమైందనే వార్తలు ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ, ఏఐపై ఫోకస్ పెంచిన క్రమంలో పునర్వ్యవస్ధీకరణ పేరుతో కొలువుల కోతకు సిద్ధమవుతున్నదని చెబుతున్నారు. ఇక జులైలో ఇంటెల్ భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది.
మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం మంది అంటే దాదాపు 15000 మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసేందుకు చిప్‌మేకర్ ప్రణాళికలు రూపొందించిందనే వార్తలొచ్చాయి. ఇక మైక్రోసాఫ్ట్, యూకేజీ, డైసన్, కాస్పర్‌స్కై, అన్అకాడమీ, వేకూల్ వంటి పలు కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను కుదించే ప్రణాళికలు పదును పెడుతున్నాయి.