ముంబై, అక్టోబర్ 11: దేశీయ కరెన్సీ విలవిలలాడుతున్నది. డాలర్ దెబ్బకు కరెన్సీ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ తొలిసారిగా 84 స్థాయిని అధిగమించింది. శుక్రవారం ఒకేరోజు 12 పైసలు దిగజారి మునుపెన్నడూ లేనివిధంగా 84.10 స్థాయికి జారుకున్నది.
దేశీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ఉండటం, డాలర్‌కు డిమాండ్ ఉండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో పాటు అంతర్జాతీయంగా ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొనడంతో చమురు ధరలు భగ్గుమనే అవకాశం ఉండటంతో కరెన్సీ విలువ బలహీన పడటానికి ప్రధాన కారణాలని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు.
ప్రారంభంలో లాభాలు..
ఫారెక్స్ మార్కెట్ ప్రారంభంలో లాభపడిన రూపాయి విలువ సమయం గడుస్తున్న కొద్ది నష్టాల్లోకి జారుకున్నది. 83.97 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు 83.96 స్థాయి నుంచి 84.10 స్థాయిలో కదలాడింది. చివరకు 12 పైసలు నష్టపోయి 84.10 వద్ద ముగిసింది. ఆగస్టు 8 తర్వాత కరెన్సీకి ఇదే కనిష్ఠ స్థాయి ముగింపు. రూపాయి పతనాన్ని అడ్డుకట్ట వేయడానికి రిజర్వు బ్యాంక్ అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ విఫలమైంది.
వీటికి తోడు ఎఫ్ఐఐలు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం పతనానికి ఆజ్యంపోసిందని ఫిన్రెక్స్ ట్రెజరీ హెడ్ అనిల్ కుమార్ తెలిపారు. రూపాయి విలువ ఇలాగే పడిపోతే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నదన్నారు. విదేశాల నుంచి దిగుమతయ్యే వస్తువుల కోసం అధికంగా చెల్లింపులు జరుపాల్సి ఉంటుందని చెప్పారు. స్వల్పకాలంలో రూపాయి 84.25 స్థాయికి పతనం కావచ్చునని ఆయన అంచనావేస్తున్నారు. రూపాయి పతనంతో దిగుమతిదారులు తమ కొనుగోళ్లను నిలిపివేయనున్నారు.
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన విదేశీ మారకం నిల్వలు కరిగిపోయాయి. ఈ నెల 4తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 3.709 బిలియన్ డాలర్లు తరిగిపోయి 701.176 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వుబ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది. గతవారంలో విదేశీ కరెన్సీ రూపంలోవున్న ఆస్తుల విలువ తరిగిపోవడం ఇందుకు కారణమని తెలిపింది. గతవారంలో 3.511 బిలియన్ డాలర్లు తగ్గి 612.643 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అలాగే గోల్డ్ రిజర్వులు 40 మిలియన్ డాలర్లు తగ్గి 65.756 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.