హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పారిశ్రామిక పురోభివృద్ధి కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టి చర్యలు క్రమంగా ఫలితాలిస్తున్నాయి. నాడు బీఆర్ఎస్ హయాంలో తుదిదశకు చేర్చిన పారిశ్రామికవాడలు ఇప్పుడు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో తాజాగా మరో 12 ఇండస్ట్రియల్ పార్కులు కూడా ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పన పూర్తికావడంతో వాటిని టీజీఐఐసీ విక్రయానికి ఉంచింది. ఇవి చాలావరకు హైదరాబాద్ శివారు జిల్లాల్లోనే ఉండటంతో భారీ గిరాకీ ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఆ పారిశ్రామికవాడల్లోని ప్లాట్లను ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేసుకునేవారికి కేటాయించనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ప్లాట్లు, వాటి ధరలకు సంబంధించిన వివరాలు టీజీఐఐసీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, కావాల్సినవారు ప్రాజెక్టు నివేదికతో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నిబంధనల ప్రకారం ఎస్సీలు, ఎస్టీలతోపాటు మహిళలకు కొన్ని ప్లాట్లు రిజర్వు చేశామని, మిగిలిన ప్లాట్లను ఓపెన్ క్యాటగిరీలో కేటాయిస్తామని వివరించారు. కేసీఆర్ హయాంలో పరిశ్రమలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్తుతోపాటు పలు ప్రోత్సాహకాలు అందించడంతో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి.
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం
కేసీఆర్ ప్రభుత్వం పరిశ్రమల కోసం దాదాపు లక్షన్నర ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేసినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలమవుతున్నది. గత ఏడాదిన్నర కాలంలో కొత్తగా కనీసం ఒక్క పారిశ్రామికవాడను కూడా అభివృద్ధి చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన 12 పారిశ్రామికవాడలు గత బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే సిద్ధమయ్యాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు వాటిని అందుబాటులోకి తెచ్చేందుకే ఇంతకాలం పట్టింది.
తొమ్మిదిన్నర ఏండ్లలో 156 వాడలు
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిశ్రమల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేయడంతోపాటు అందులో దాదాపు 28,458 ఎకరాలు పరిశ్రమలకు కేటాయించింది. వివిధ జిల్లాల్లో కొత్తగా 156 పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసింది.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఎంఎస్ఎంఈ పార్కులు (ఎకరాల్లో)