న్యూఢిల్లీ, మే 15: కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు రైటాఫ్ చేసిన రుణాల విలువ దాదాపు రూ.12.50 లక్షల కోట్లుగా ఉన్నది. 2014-15 నుంచి 2018-19 మధ్యనున్న తొలి ఐదేండ్ల కాలంలో రూ.6,24,370 కోట్ల రుణాలను రైటాఫ్ చేసిన సర్కారీ బ్యాంకులు.. 2019-20 నుంచి 2023-24 మధ్యనున్న తర్వాతి ఐదేండ్లలో మరో రూ.6,14,443 కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయి. ఇందులో ఎక్కువభాగం రుణాలు కార్పొరేట్లకు చెందినవే కావడం గమనార్హం. ఇక ఈ మొత్తం రైటాఫ్ జరిగిన రుణాల్లో సగభాగం భారీ పరిశ్రమలు, సేవల రంగానికి చెందిన సంస్థలవే ఉన్నాయని పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖే చెప్పింది.
తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించని సామాన్యులపై కొరడా ఝుళిపిస్తున్న బ్యాంకులు.. కార్పొరేట్లకిచ్చిన లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ల పేరిట ఖాతా పుస్తకాల్లో నుంచి వదిలించుకుంటున్నాయి. ఒక్క ఈఎంఐ (నెలవారీ కిస్తీ) చెల్లించకపోయినా వందలసార్లు.. సగటు రుణగ్రహీతను హెచ్చరిస్తున్న బ్యాంకర్లు.. ఏండ్ల తరబడి కార్పొరేట్లు ఇవ్వకపోయినా చేసేదేమీ లేక రైటాఫ్లకు దిగుతుండటంపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాలు సైతం కార్పొరేట్లకే వత్తాసు పలుకుతున్నాయని, ఈ రకమైన తీరు బ్యాంకింగ్ రంగాన్ని, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికినే చివరకు ప్రమాదంలో పడేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.