ముంబై, జనవరి 13: దేశీయ ఫారెక్స్ నిల్వలు మళ్లీ క్షీణించాయి. ఈ నెల 6తో ముగిసిన వారంలో 1.268 బిలియన్ డాలర్లు పడిపోయి 561.583 బిలియన్ డాలర్లకు విదేశీ మారకపు నిల్వలు పరిమితమయ్యాయి. ఈ మేరకు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. అంతకుముందు వారం 44 మిలియన్ డాలర్లు పెరిగాయి. అయితే ఆ మునుపు రెండు వారాలు తరిగిపోవడం గమనార్హం. నిజానికి 2021 అక్టోబర్‌లో దేశీయ ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్లకు చేరి ఆల్‌టైం హై రికార్డును నెలకొల్పాయి. ఆ తర్వాత ఇప్పటిదాకా ఎప్పుడూ ఆ స్థాయిని దాటలేదు. ఇక అప్పటితో పోల్చితే దాదాపు 85 బిలియన్ డాలర్ల మేర విదేశీ మారకపు నిల్వలు క్షీణించాయి. కాగా, డాలర్‌తో పోల్చితే పడిపోతున్న రూపాయి మారకం విలువను నిలబెట్టడానికి ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలూ.. ఫారెక్స్ నిల్వల పతనానికి దారితీస్తున్నాయని అంటున్నారు. రూపాయి నష్టాన్ని ఆపేందుకు మార్కెట్లోకి రిజర్వ్ బ్యాంక్ డాలర్లను ఎక్కువగా తీసుకొస్తుండటమే కారణం. ఇదిలావుంటే దేశీయ ఫారెక్స్ నిల్వల్లో మెజారిటీ వాటాను కలిగి ఉన్న విదేశీ కరెన్సీ ఆస్తులు ఈ నెల 6తో ముగిసిన వారంలో 1.747 బిలియన్ డాలర్లు తగ్గి 496.441 బిలియన్ డాలర్లకు దిగాయి. మరోవైపు బంగారం నిల్వలు 461 మిలియన్ డాలర్లు పెరిగి 41.784 బిలియన్ డాలర్లకు ఎగిశాయి.
స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. ఐటీ, ఆర్థిక, మెటల్ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు తిరిగి కోలుకున్నాయి. దీంతో వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 303 పాయింట్లు ఎగబాకి 60,261.81కి చేరుకున్నది. ఇంట్రాడేలో 460 పాయింట్లు పెరిగిన సూచీ చివర్లో ఇంతటి లాభాలను నిలుపుకోలేకపోయింది. అటు నిఫ్టీ సైతం 98.40 పాయింట్లు అందుకొని 17,956.60 వద్ద స్థిరపడింది. ద్రవ్యోల్బణ గణాంకాలు మరింత తగ్గడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన అనుకూల సంకేతాలు సూచీలకు మరింత కిక్కునిచ్చాయి. టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లు రెండు శాతానికి పైగా పెరిగాయి. వీటితోపాటు ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, టీసీఎస్, ఎన్టీపీసీ, మారుతి, భారతీ ఎయిర్‌టెల్‌లు ఒక్క శాతానికి పైగా లాభపడ్డాయి. అలాగే ఎస్బీఐ, మహీంద్రాఅండ్‌మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్, పవర్‌గ్రిడ్, టెక్‌మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ బ్యాంక్‌ల షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది. కానీ, టైటాన్, నెస్లె, ఎల్అండ్టీ, ఐటీసీ, విప్రో, రిలయన్స్, టాటా మోటర్స్, యాక్సిస్ బ్యాంక్‌లు
నష్టపోయాయి.